logo

కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు: అమర్‌

కార్పొరేట్‌ స్థాయిలో అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 04:47 IST

జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ విభాగం

శిశు సంరక్షణ విభాగం వార్డును ప్రారంభించిన మంత్రి అమర్‌, ఎంపీ సత్యవతి, జేసీ తదితరులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ స్థాయిలో అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఆసుపత్రిలో రూ. 92 లక్షలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ విభాగం, రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్‌) వార్డును సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక దృష్టి సారించామని, దీంట్లో భాగంగా 90 శాతం వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశామని, మిగిలినవి త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. నవజాత శిశు సంరక్షణ విభాగంలో ఆధునిక వసతులు కల్పించి తల్లీ, బిడ్డకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మార్చి 1 కల్లా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే 26 వేల మంది వైద్య సిబ్బందిని భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనకాపల్లి పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతోందని, చుట్టుపక్కల కర్మాగారాలు వెలుస్తున్నాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులకు వైద్య సేవలు అందించేలా లారస్‌ సంస్థ అనకాపల్లి ఆసుపత్రిలో రూ. 4 కోట్ల వ్యయంతో బర్నింగ్‌ వార్డు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బర్నింగ్‌ వార్డులో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేవరకు తమ సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించేందుకు లారస్‌ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ జాతీయస్థాయి సాంకేతికతతో కూడిన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు అనకాపల్లి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారన్నారు.

కేజీహెచ్‌కు పంపే అవసరం లేకుండా..

జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ రోగులను కేజీహెచ్‌కు పంపాల్సిన అవసరం లేకుండా వైద్యం అందించేలా ఆధునిక వార్డు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులైన డాక్టర్‌ రామ్మూర్తి, పొలమరశెట్టి మురళీ, రత్నకుమారి, మున్నూరు శ్రీనివాసరావును మంత్రి అమర్‌ సత్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య విధాన పరిషత్‌ సమన్వయకర్త డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ హేమంత్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు భీశెట్టి వరహా సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య,. పట్టణ వైకాపా అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, వైకాపా నాయకులు పలకా రవి, జాజుల రమేష్‌, మళ్ల బుల్లిబాబు, జోసఫ్‌,  కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని