logo

కోట్ల ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలి

 ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌చైన్‌, కృత్రిమమేధ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రాబోయే పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల వరకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 04:47 IST

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మాట్లాడుతున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. చిత్రంలో ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, భాజపా నాయకులు

ఈనాడు, విశాఖపట్నం:  ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌చైన్‌, కృత్రిమమేధ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రాబోయే పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల వరకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వీటిలో 50 శాతం భారతీయులు చేజిక్కించుకోగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖలోని భాజపా సీనియర్‌ నాయకుడు, కార్మిక రాజ్య బీమా జాతీయ పూర్వ సభ్యులు చెరువు రామకోటయ్య ఇంటికి  వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు తగిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌.ఇ.పి.) అత్యుత్తమంగా ఉందని, అది విద్యారంగ దిశ, దశను మారుస్తుందన్నారు. ఎన్‌ఈపీని పూర్తిస్థాయిలో అమలచేసే మొదటి రాష్ట్రంగా హరియాణా 2025 నాటికి గుర్తింపు సాధించగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు ఎన్‌ఈపీపై వ్యతిరేక ధోరణి కలిగి ఉండడం సరికాదన్నారు. గవర్నర్ల వ్యవస్థ ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతోందని విలేకరులు ప్రశ్నించగా... ‘గవర్నర్ల వ్యవస్థ ఎప్పుడూ వివాదం కాదు. అప్పుడప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే తీరే వివాదాస్పదంగా ఉంటుంది. రాజ్యాంగ పరిధిలోనే గవర్నర్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ వ్యవస్థని అందరూ గౌరవించాలి. మతం, ప్రాంతం, భాషలకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే వివాదాలు మరింతగా ముదిరే ముప్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. తమకు జీతాలు సకాలంలో రావడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, అలాంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు ఏమైనా ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘అలాంటి ఫిర్యాదులపై గవర్నర్లకు ఎలాంటి అధికారం ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఆయా ఫిర్యాదులను ప్రభుత్వానికి పంపి తగిన చర్యలు తీసుకోవాలని కోరతాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని