logo

ప్రాణాలు తీస్తున్న అతివేగం!!

రహదారి ప్రమాదాలపై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోబోయే చర్యలను ‘ఏడాది సమీక్ష’ సందర్భంగా గత డిసెంబరులో సీపీ శ్రీకాంత్‌ వివరించారు.

Published : 31 Jan 2023 04:47 IST

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌  సిబ్బంది(పాతచిత్రం)

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడపొద్దు. మొదటి రెండు సార్లు పోలీసులకు చిక్కితే కౌన్సెలింగ్‌ ఇస్తాం. మూడోసారి చిక్కితే..తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. భారీగా జరిమానా విధిస్తాం.

శ్రీకాంత్‌, సీపీ


ప్రయాణించేటప్పుడు విధిగా శిరస్త్రాణం ధరించాలి. అదీ... నాణ్యమైనదే. వాడాలి.  

ట్రాఫిక్‌ పోలీసులు


హదారి ప్రమాదాలపై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోబోయే చర్యలను ‘ఏడాది సమీక్ష’ సందర్భంగా గత డిసెంబరులో సీపీ శ్రీకాంత్‌ వివరించారు. పోలీసులు వీటిపై దృష్టిసారించాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ మల్లికార్జున ఇటీవల రోడ్డు భద్రతా వారోత్సవాల్లోనూ పలు సూచనలు చేశారు. దీంతో రద్దీ సమయాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, భారీ వాహనాల నియంత్రణపై ఆంక్షలు విధిస్తూ  .. బ్లాక్‌స్పాట్స్‌(ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు)పై దృష్టి సారిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
జు విశాఖ నగర పరిధిలో ప్రమాదాలపై యువతకు, విద్యార్థులకు, స్థానికులకు  అవగాహన కల్పించేందుకు పోలీసులు ఓ ప్రయత్నం ఆరంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను వారికి చూపించి మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. భారీ తెరలతో కూడిన కొన్ని వాహనాలను అన్ని ప్రధాన కూడళ్లలో తిప్పుతున్నారు. ప్రమాదం జరిగిన తీరును వివరించటంతో పాటు వారిలో మార్పును తీసుకువచ్చేందుకు వాహనచోదకులు చేసిన తప్పును విపులంగా ట్రాఫిక్‌ పోలీసులు వివరిస్తున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, కూడళ్లు, సమయాలు ఇలా అన్నింటిని తెలియజేస్తున్నారు. డ్రైవింగ్‌లో మెలకువలపైనా  చైతన్యపరుస్తున్నారు.శిరస్త్రాణం ధరించకే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని వివరించి ...తప్పకుండా ధరించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

* నగర పరిధిలో ట్రాఫిక్‌ పోలీసుల కళ్లు కప్పి వాహనాలను ఇష్టారీతిన నడిపే వారిని గుర్తించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వీక్షిస్తున్నారు. అక్కడ నుంచే సీసీ కెమెరాల ద్వారా ట్రిపుల్‌ రైడింగ్‌, జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.


భరణికంలో విషాదఛాయలు

విషాదంలో సాయికుమార్‌, లోకేశ్‌ తల్లిదండ్రులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ వద్ద కోనాం చెరువు సమీపంలోని శ్మశానవాటిక మలుపు వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో భరణికం గ్రామానికి చెందిన పెదపాటి మోహన్‌, పద్మ దంపతుల కుమారుడు సాయికుమార్‌(13), మునాసుల కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు లోకేశ్‌(14) మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మోహన్‌ కార్పెంటర్‌... పద్మ కూలి పనులకు వెళ్తుంది. వీరికి సొంతిల్లు కూడా లేదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. లోకేశ్‌ తండ్రి కోటేశ్వరరావు కార్పెంటర్‌గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.. వెంకటలక్ష్మి గృహిణి. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు ఈ లోకంలో లేడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని