logo

విశాఖ ఉక్కు.. తెలుగోడి హక్కు!

భారీ సంఖ్యలో కార్మికులు హాజరై ఉక్కు ప్రజా గర్జన సభను విజయవంతం చేశారు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు, అమ్మేది ఎవడ్రా..కొనేది ఎవడ్రా అంటూ నినదించారు.

Published : 31 Jan 2023 04:47 IST

నినదించిన  ఉద్యోగులు
విజయవంతంగా ‘ఉక్కు ప్రజా గర్జన’ సభ

వేదికపై మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌. చిత్రంలో వివిధ పార్టీల నాయకులు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు

ఈనాడు, విశాఖపట్నం, ఉక్కునగరం, న్యూస్‌టుడే: భారీ సంఖ్యలో కార్మికులు హాజరై ఉక్కు ప్రజా గర్జన సభను విజయవంతం చేశారు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు, అమ్మేది ఎవడ్రా..కొనేది ఎవడ్రా అంటూ నినదించారు. సోమవారం ఉక్కునగరంలోని త్రిష్ణా మైదానంలో జరిగిన బహిరంగ సభకు కార్మిక, నిర్వాసిత సంఘాల నాయకులతో పాటు రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. కార్పొరేటర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉక్కు కర్మాగారంంలోని వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ‘రగులుతోంది ఉక్కు ఉద్యమం’, ‘కదలండి కదలండి’ అంటూ ఉక్కు పోరాటం గీతాలకు మహిళల కోలాట నృత్యాలు అలరింపజేశాయి. ఈ సందర్భంగా నిర్వాసిత కుటుంబాలు, కొందరు ఉద్యోగులు సభా ప్రాంగణంలో ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలంటూ ప్రదర్శనలు చేశారు. విభజన తర్వాత రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వ భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారమేనని దీన్ని కాపాడుకోవాలని ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు.

* ఉమ్మడి విశాఖ వైకాపా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం వ్యాపార సంస్థ కాదు. ఎంతోమంది బలిదానాలతో ఏర్పడిందన్నారు. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వైకాపా పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు జింక్‌ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏం చేయలేక పోయాయని, ఇప్పుడు అలా జరగకుండా అడ్డుకుంటామన్నారు.

* మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ‘ గతంలో ఉక్కు పరిరక్షణకు కార్మిక సంఘాలు సీఎంను కలిసిన నెల రోజుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసిందన్నారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వేరైనా అందరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకటే ఆశిస్తున్నారు.  64 గ్రామాల నిర్వాసితులు రోడ్లు మీద ఉన్నారు. అయినా కేంద్రం ముందుకు వెళ్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. ప్లాంటు రక్షణ పోరాటంలో వైకాపా భాగస్వామ్యం ఉంటుంది’ అన్నారు.  

* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  మాట్లాడుతూ ‘వైకాపా ప్రభుత్వం కేంద్రం మెడలు వంచక్కర్లేదు, ప్రశ్నించక్కర్లేదు. వైకాపా ఎంపీలంతా ముందుకొచ్చి ప్రశ్నిస్తే చాలు. త్యాగాలతో సాధించిన కర్మాగారాన్ని ఆదానీకి అప్పగిస్తే ఒప్పుకోమని గట్టిగా చెప్పండి. వామపక్షాల నుంచి ఎంపీలను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. వైకాపా హయాంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు’ అని పేర్కొన్నారు. ‘ఉక్కును భాజపా ప్రైవేటీకరణ చేసినా...తాము కేంద్రంలో పాలన చేపడితే జాతీయీకరణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారాస సభలో ఇటీవల పేర్కొన్నారు’ అని గుర్తు చేశారు.

* ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అప్పట్లో ఎకరా రూ.1470కి రైతులు భూములిచ్చిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ ఎకరా రూ.పది కోట్ల వరకు ఉందన్నారు. నాడు భూములిచ్చిన రైతులు ఎంత పరిహారం ఇస్తారని అడగలేదు. కర్మాగారం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మాత్రమే ఆలోచించారన్నారు. ఇప్పటికే జీవీఎంసీ, జడ్పీ సమావేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు.

* మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఉద్యమం కేవలం నిర్వాసితులది మాత్రమే కాదు ప్రతి గ్రామానిదన్నారు. అధికార పార్టీ మీద ఒత్తిడి తేవాలన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉక్కు కర్మాగారాన్ని కాపాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గంగవరం పోర్ట్‌లో రాష్ట్రం వాటా అమ్మేశారన్నారు. తెదేపా అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టేవాళ్లమన్నారు.

* ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేయాలన్నారు.  రెండేళ్లుగా సాగుతున్న ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు.

* కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారానికి  దేశంలోని కాంగ్రెస్‌ ఎంపీల మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం  పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే రాహుల్‌గాంధీని ఇక్కడికి పిలిపించి సభ ఏర్పాటు చేయిస్తామన్నారు.

* మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, జనసేన నాయకులు కోణ తాతారావు, శివశంకర్‌, సీపీఐ సహ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు అయోధ్యరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని