logo

‘ముడసర్లోవ’పై నేతల పాచిక

మహా విశాఖ నగరపాలక సంస్థ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పెద్దఎత్తున సాగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలో యూజీడీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తనఖా పెట్టిన జీవీఎంసీ అధికారులు..

Published : 31 Jan 2023 04:55 IST

282 ఎకరాలు కట్టబెట్టేలా అడుగులు
కౌన్సిల్‌ అజెండాలో ప్రతిపాదనపై తీవ్ర చర్చ
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ముడసర్లోవ వద్ద నిర్మిస్తున్న ప్రహరీ

హా విశాఖ నగరపాలక సంస్థ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పెద్దఎత్తున సాగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలో యూజీడీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తనఖా పెట్టిన జీవీఎంసీ అధికారులు.. తాజాగా ముడసర్లోవ, పూర్ణమార్కెట్‌ లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. మరో వైపు గతంలో వేసిన కొన్ని రహదారులనే జీ-20 సదస్సుల పేరిట మళ్లీ నిర్మించడానికి ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు రూపొందించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గోపాలపట్నం నుంచి ఎన్‌ఏడీ వరకు అమృత్‌ పథకంలో భాగంగా తవ్విన రహదార్ల మరమ్మతులకు జీవీఎంసీ నిధులు వెచ్చిస్తుండడం అనుమానాలకు దారి తీస్తోంది.

పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం: ముడసర్లోవ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఆరిలోవ, పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవీఎంసీకి ఉన్న ఏకైక జల వనరైన ఈ రిజర్వాయర్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. గతంలో రిజర్వాయర్‌లో హైటెక్‌ బోర్లు వేయడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వన్యప్రాణులు సంచరించే పరివాహక ప్రాంతంలో పార్కులు నిర్మిస్తామంటే ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.


గతంలోనే వ్యూహం: వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముడసర్లోవ భూములపై కొందరు నాయకుల కన్ను పడింది. ముడసర్లోవ రిజర్వాయర్‌ను ఆనుకుని  జీవీఎంసీకి 800 ఎకరాల స్థలం ఉంది. పరివాహక ప్రాంతం కావడంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినా అక్కడి భూములు కొట్టేయాలని వైకాపా నేతలు కొందరు రెండు సార్లు వీఎంఆర్‌డీఏ అధికారులతో, మూడు సార్లు జీవీఎంసీ అధికారులతో అక్కడ పర్యటించారు. గోల్ఫ్‌ కోర్స్‌కు కేటాయించిన 116 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవడానికి అవకాశాలు పరిశీలించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నాడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోల్ఫ్‌ కోర్స్‌ నిర్వాహకులుగా ఉన్న నావికాదళ ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేశారు. ఆ తరువాత మిగిలిన భూములపై కొందరు నేతలు కన్నేశారు. పాలకవర్గాన్ని ఉపయోగించి పీపీపీ (ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం) ద్వారా థీమ్‌ పార్కులు నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ముడసర్లోవ భూముల రక్షణ కోసమని రూ.9 కోట్లతో ప్రహరీ నిర్మిస్తుండడం ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ పనులు అయిన తరువాత ఇక్కడ దాదాపు 282 ఎకరాల భూమిని ఇతరులకు అప్పగించే కార్యాచరణ సాగుతోందని సమాచారం.


బాగున్న రోడ్లపైనే: జీ-20 సన్నాహక సదస్సుల పేరిట రూ.27కోట్లతో నోవాటెల్‌ చుట్టు పక్కల ఉన్న రహదారులపై బీటీ లేయర్‌ వేయడం, నడక మార్గాల అభివృద్ధి, పాడైపోయిన టైల్స్‌ను తిరిగి ఏర్పాటు చేయటానికి  అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల నావికాదళ విన్యాసాలు జరిగినప్పుడు రూ.15కోట్లతో ఈ ప్రాంతాల్లో జీవీఎంసీ సుందరీకరణ పనులు చేపట్టింది. ఆర్నెళ్లు దాటక ముందే తిరిగి ప్రతిపాదనలు తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కమిషనర్‌ రాజాబాబును వివరణ కోరగా రహదారిపై బీటీ లేయర్‌ అవసరమని భావిస్తేనే పునరుద్ధరణ పనులు చేపడ తామని, లేకుంటే రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు.


పెందుర్తి- గోపాలపట్నం మార్గంలో రహదారి ఇలా..

* గోపాలపట్నం నుంచి ఎన్‌ఏడీ వరకు రూ.240 కోట్లతో 24 గంటల తాగునీటి సరఫరా ప్రాజెక్టు జరుగుతోంది. ప్రాజెక్టులో భాగంగా రహదారిని తవ్వేశారు. పనులు పూర్తయిన తరువాత రహదారిని గుత్తేదారు పునరుద్ధరించాల్సి ఉంది. అయితే..జీవీఎంసీ అధికారులు రూ.8 కోట్లతో పనులు ప్రతిపాదించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక వేళ పనులు చేస్తే.. సంబంధిత గుత్తేదారు నుంచి ఆ నిధులు వసూలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు