logo

సాయానికి సవాలక్ష సాకులు

ప్రమాదవశాత్తుగాని సహజ మరణం వల్లగాని ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్నాళ్లుగా బీమా పథకాలను అమలుచేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంలో వైఎస్సార్‌ బీమా పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు.

Updated : 31 Jan 2023 06:44 IST

ఆదుకుంటామని తిప్పుకొంటున్నారు!
అందని వైఎస్సార్‌ బీమా పరిహారం
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి, అచ్యుతాపురం

ప్రమాదవశాత్తుగాని సహజ మరణం వల్లగాని ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్నాళ్లుగా బీమా పథకాలను అమలుచేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంలో వైఎస్సార్‌ బీమా పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అర్హులైనా ఏవో సాకులు చెప్పి సచివాలయాలు, వెలుగు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కాళ్లరిగేలా తిరిగినా ఇదిగో..అదిగో అనడమే తప్ప ఎప్పుడిచ్చేది స్పష్టంగా చెప్పేవారు కనిపించడం లేదు.

తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం సక్రమంగా అమలయ్యేది. కుటుంబంలో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణం పొందినా అదేరోజున అంతిమ సంస్కారాలకు రూ.10 వేలు ఇంటికి అందజేసేవారు. మిగతా మొత్తం దశదిన కర్మ రోజులోగా నామినీ ఖాతాలో జమచేసేవారు. దీని అమలు కోసం బీమా మిత్రలు పనిచేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని తొలగించారు. కుటుంబంలో సంపాదనాపరుడు చనిపోతేనే బీమా వర్తింపజేస్తున్నారు. ఆ విధంగా ఉమ్మడి జిల్లాలో 4.88 లక్షల మందిని కుటుంబ పెద్దలుగా గుర్తించి వారినే బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.

వారిలో ఎవరైనా 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు బీమా కంపెనీ ద్వారా చెల్లిస్తున్నారు. 50 ఏళ్లలోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో సక్రమంగానే పరిహారం అందించారు. తర్వాత కొన్నాళ్లకు ఆర్థిక సాయం అందించడంలో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా వందలాది మంది బాధిత కుటుంబాలు ఈ పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి.


ఏడాదైనా అందని పరిహారం

* 2022-23 జులై నుంచి డిసెంబర్‌ వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు సంబంధించి క్లైమ్‌ల కోసం 113 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 38 మందికి మాత్రమే పరిహారం అందింది. మిగతా వారు ఆర్థిక సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందాల్సి ఉంది.

* గతేడాది జులై నుంచి డిసెంబర్‌ వరకు సహజ మరణాలు పొందినవారు 600 మంది వరకు ఉన్నారు. వీరందరికీ డిసెంబర్‌లో క్లెయిమ్‌లు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆర్థిక సాయం చేరని వారున్నారు.

* 2021-22లో సహజ మరణాలకు సంబంధించి ఇప్పటికీ 172 మందికి పరిహారం అందలేదు. ప్రమాదవశాత్తు మరణించిన వారిలో కూడా చాలా మంది ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  


నాగమణికి న్యాయం జరిగేదెన్నడో?

ఇద్దరు పిల్లలతో నాగలక్ష్మి

ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలతో దీనంగా ఉన్న మహిళ పేరు మొల్లి నాగలక్ష్మి. భర్త తాతాజీ గతేడాది జూన్‌లో అనారోగ్యంతో మరణించారు. బీమాకోసం అప్పట్లోనే సచివాలయంలో దరఖాస్తు చేశారు. ఇంత వరకు ఆమెకు ఒక్కపైసా కూడా చేరలేదు. కూలికి వెళుతూ, తల్లి సహకారంతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. భర్త మరణించినప్పుడు అంతిమ కార్యక్రమాల నిమిత్తం, అదే విధంగా అంతకుముందు చేసిన అప్పులు ఉన్నాయి. బీమా వస్తే చెల్లిద్దామని చూస్తున్న నాగమణికి న్యాయం జరగలేదు. రూ.లక్ష సాయం కోసం బాధితురాలు పిల్లలతో కలిసి కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తోంది.


బీమా రాదు.. పింఛనూ లేదు!
- ప్రసాదుల అప్పలరాజు, వేంపాడు

నా భర్త అయిదు నెలల కిందట మరణించారు. బీమా వస్తుందని చెబితే వాలంటీర్‌ ద్వారా గ్రామ సచివాలయానికి వివరాలు అందించాను. ఇద్దరు పిల్లలున్నారు. ఓ ఆడపిల్లకు పెళ్లి చేశాను. కొడుకు, నేనూ కూలి పనికి వెళుతున్నాం. ఇంటిల్లిపాది కష్టపడితేనే పూట గడిచేది. ఇంత వరకు బీమా సొమ్మురాలేదు. అడిగితే అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. కనీసం వితంతు పింఛన్‌ వస్తుందని చూస్తే అదీరాలేదు.


కాళ్లరిగేలా తిరుగుతున్నా..
- భీమవరపు నాగమణి, గొర్లెధర్మవరం, అచ్యుతాపురం మండలం

తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వద్ద 2020లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్త చనిపోయాడు. బీమా సొమ్ములు వస్తే పిల్లలను బాగా చదివించుకోవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగితాలు పట్టుకొని కాళ్లరిగేలా తిరిగినా కనికరం చూపడంలేదు. అధికారులు, వైకాపా నాయకులను ఎన్నిసార్లు అడిగినా వస్తుందనే చెబుతున్నారు.. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించలేకపోతున్నాను.  


అందరికీ అందుతుంది..
- లక్ష్మీపతి, పీడీ డీఆర్‌డీఏ

వైఎస్సార్‌ బీమా క్లెయిమ్‌లకు దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయడం అంతా సచివాలయాల పరిధిలో జరుగుతుంది. సహజ మరణాలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేస్తున్నప్పుడల్లా బాధిత కుటుంబాల ఖాతాలకు నేరుగా జమఅవుతున్నాయి. ప్రమాద మరణాలకు బీమా సంస్థ నుంచి పరిహారం వస్తుంది. వాటిపై ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపిస్తున్నాం. అర్హులైన బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం అందుతుంది..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని