logo

అధికారులు మారారు.. అడ్డెవరు?

కోట్లు ఖరీదు చేసే భూములు వైకాపా నాయకుల కనుసన్నల్లో కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఏమిచేయలేకపోతున్నారు.

Published : 01 Feb 2023 05:25 IST

రూ. కోట్లు ఖరీదు చేసే స్థలం కబ్జా
హెచ్చరిక బోర్డులను పీకేసి నిర్మాణాలు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

గెడ్డపోరం స్థలంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు

కోట్లు ఖరీదు చేసే భూములు వైకాపా నాయకుల కనుసన్నల్లో కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఏమిచేయలేకపోతున్నారు. గ్రామస్థులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా అధికారపార్టీ నాయకులు అనధికార ఆదేశాలతో నిర్మాణాల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడంలేదు. గెడ్డ పోరంబోకు స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సైతం వైకాపా నాయకులకు లెక్క లేకుండా పోయాయి.

అచ్యుతాపురం మండలం మోసయ్యపేట పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 207లో 1.39 ఎకరాల గెడ్డపోరం స్థలం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ.తొమ్మిది కోట్లుపై మాటే. వైకాపా నాయకులతో కలిసి కొందరు అక్రమమార్కులు, జిరాయితీ సర్వే నంబరు వేసి ఈ స్థలాన్ని ఇప్పటికే చాలామందికి విక్రయించారు. సెంటు స్థలం రూ.ఏడు లక్షల వరకే పలికే అత్యంత విలువైన ఈ స్థలాన్ని విక్రయించడంతో పాటు కొనుగోలుదారులతో దగ్గరుండి నిర్మాణాలు చేయించడానికి వైకాపా నాయకులు కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వైకాపా నాయకుల మద్దతుతో గతంలో ఇక్కడ నిర్మాణాలకు తెరలేపడంతో గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు పుర్రే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొందరు స్పందన కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్‌, ఆర్డీఓ, అచ్యుతాపురం తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతుందని ఎమ్మెల్యే కన్నబాబుకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. స్థలాన్ని కాపాడాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించడంతో అప్పటి ఆర్డీఓ సీతారామారావు, తహసీల్దార్‌ రాంబాయి స్థలాన్ని పరిశీలించి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. వారిద్దరూ బదిలీపై వెళ్లిపోవడంతో అక్రమార్కులు గతంలో నిర్మించిన పునాదితోపాటు మరో ఇంటి పునాదికి స్తంభాలను చకచక నిర్మించేశారు.

ఇంటి నిర్మాణాన్ని గతంలో అడ్డుకున్న అప్పటి ఆర్డీఓ సీతారామారావు, తహసీల్దార్‌ రాంబాయి


పట్టించుకోవడం లేదు!

కోట్లు ఖరీదుచేసే స్థలాన్ని కొద్దికొద్దిగా కబ్జా చేయాలని చూస్తున్నారు. గత ఏడాది పునాది తీస్తే కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం. అధికారులు నిర్మాణాలు నిలుపుదల చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా వైకాపా నాయకులు అండదండలు ఉండడంతో ఇటువైపు కన్నెత్తి చూడడంలేదు. గెడ్డ భూముల్లో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలి.

పుర్రే శ్రీనివాసరావు, తెదేపా నాయకుడు, మోసయ్యపేట


చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. అచ్యుతాపురం కబ్జాకు గురైన గెడ్డపోరం స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటాం. నిర్మించిన పునాదులను తొలగించాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తాం. ప్రభుత్వ స్థలాలను కాపాడడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్షేత్రస్థాయి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి అందరూ సహకరించాలి.

చిన్ని కృష్ణ, ఆర్డీఓ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని