logo

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు అసంతృప్తికరం: గవర్నర్‌

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉపకులపతులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల సంఖ్య అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.

Published : 01 Feb 2023 05:25 IST

ఏయూ తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌ను రిమోట్‌తో
ప్రారంభిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉపకులపతులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల సంఖ్య అసంతృప్తిని కలిగిస్తోందన్నారు. ప్రపంచస్థాయి ర్యాంకింగులకు మన దేశ వర్శిటీలు పోటీపడాలన్నారు.విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏఐయూ (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్శిటీస్‌), ఏయూ సహకారంతో ఉన్నత విద్య రూపాంతరీకరణ కోసం పరిశోధన, సమర్థత (రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌) అనే అంశంపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాలు పరిశోధనలపై దృష్టి సారించకుండా కేవలం విద్యను అందించడానికే పరిమితం అవుతున్నాయని, 95 శాతం విద్యా సంస్థలు ఇలానే చేస్తున్నాయన్నారు. గతంలో శాస్త్రీయ పరిశోధనలు అధికంగా జరిగేవి. ఇప్పుడు ఆ స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా ప్రజావసరాలు, అభివృద్ధికరమైన అంశాలపై శోధన జరగాల్సి ఉందన్నారు. ప్రపంచ మేధోసంపత్తి హక్కుల 2017 సూచిక ప్రకారం చైనా 13 లక్షల పేటెంట్‌ హక్కులను పొందింతే అమెరికా 6.6 లక్షల హక్కులు పొందింది. అదే మన దేశం కేవలం 50 వేల హక్కులను మాత్రమే పొందింది. ఇందులో 68 శాతం ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఉపాధి కల్పనావకాశాలు సృష్టించడం, నైపుణ్య భారత్‌ నిర్మాణంలో ఉపకులపతులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, ఆసక్తి పెంచే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో భారత్‌ ప్రధాన పాత్ర పోషించే స్థాయికి చేరిందని గవర్నర్‌ అన్నారు. వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అణుపరీక్షలతో శత్రు దేశాలు వెనక్కి తగ్గాయి. దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదనే సందేశం ఆ పరీక్షల ద్వారా ప్రపంచానికి చెప్పగలిగామన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ 2020 నూతన విద్యావిధానాన్ని ఏపీ అందిపుచ్చుకొని సంస్కరణలకు నాంది పలికిందన్నారు. ఏఐయూ అధ్యక్షుడు సురంజన్‌ దాస్‌, ప్రధాన కార్యదర్శి పంకజ్‌ మిట్టల్‌ ఏఐయూ కార్యకలాపాల గురించి వివరించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపకులపతులు ఏయూలోని పరిశోధనలను పరిశీలించి తగు సూచనలు చేస్తే వాటిని అమలు చేస్తామన్నారు. గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ కె.రామ్మోహనరావు, ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, దక్షిణ భారతదేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇందులో పాల్గొన్నారు.

తాళపత్ర గ్రంథం

తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ ప్రారంభం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ వి.ఎస్‌.కృష్ణ గ్రంథాలయం చేపట్టిన తాళపత్రాల డిజిటలైజేషన్‌ను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రిమోట్‌తో ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్‌ హాలులో మంగళవారం జరిగిన దక్షిణ భారతదేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో పాల్గొన్న గవర్నర్‌ రిమోట్‌ సాయంతో దీనిని ప్రారంభించారు. డిజిటలీకరణ వల్ల అపురూపమైన తాళపత్ర గ్రంథాలు చెడిపోకుండా భావితరాలకు ఉపయోగపడతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు