logo

బియ్యం కార్డులకు.. గోధుమపిండి

నగర, పట్టణ ప్రాంతాల్లోని బియ్యం కార్డుదారులకు ఈనెల నుంచి రెండు కిలోల చొప్పున గోధుమ పిండిని రాయితీ ధరపై పంపిణీ చేయనున్నారు.

Published : 01 Feb 2023 05:34 IST

ఈనెల నుంచి 2 కిలోల చొప్పున పంపిణీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగర, పట్టణ ప్రాంతాల్లోని బియ్యం కార్డుదారులకు ఈనెల నుంచి రెండు కిలోల చొప్పున గోధుమ పిండిని రాయితీ ధరపై పంపిణీ చేయనున్నారు. విశాఖ జిల్లాలో 5,21,417 బియ్యం కార్డులు ఉంటే జీవీఎంసీ పరిధిలోని 4,54,483 కార్డులకు మాత్రమే గోధుమ పిండి కేటాయిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం కార్డుల్లో ఇది 87.15శాతంగా ఉంది. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని నగర, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో స్పందన లభిస్తే మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నారు.

* బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమపిండి రూ.35 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. పౌరసరఫరాల శాఖ బియ్యం కార్డుదారులకు కిలో కేవలం రూ.16లకు ఇవ్వనుంది. కిలో ప్యాకెట్ల రూపంలో వీటిని పంపిణీ చేయనున్నారు. జిల్లా అవసరాలకు 908 టన్నులు కేటాయించగా, డిపోలకు తరలించామని జిల్లా పౌరసరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావు తెలిపారు. జిల్లాలోని 620 చౌక డిపోలకు గోధుమపిండి సహా అన్ని రకాల సరకులు చేరాయని, బుధవారం నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు. బియ్యం ఉచితంగా ఇస్తామని, రూ.13.50కు అర కిలో పంచదార, రూ.67కు కిలో చొప్పున కందిపప్పు ఇవ్వనున్నామని డీసీఎస్‌ఓ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన పద్మనాభం, ఆనందపురం, భీమునిపట్నం, పెందుర్తి మండలాల పరిధిలోని కొన్ని బియ్యం కార్డులకు గోధుమ పిండి విడుదల కాలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని