logo

‘ముడసర్లోవ’పై పోరు

ప్రజలకు తాగునీటిని అందించడంతోపాటు, భూగర్భ జలాలను సంరక్షిస్తున్న ముడసర్లోవ భూములను ప్రయివేటుకు అప్పగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Published : 01 Feb 2023 05:34 IST

తెదేపా, వామపక్షాల నేతలు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ఆందోళనలో పాల్గొన్న వెలగపూడి, పల్లా శ్రీనివాసరావు తదితరులు

ప్రజలకు తాగునీటిని అందించడంతోపాటు, భూగర్భ జలాలను సంరక్షిస్తున్న ముడసర్లోవ భూములను ప్రయివేటుకు అప్పగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు తెదేపా, వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పల్లా మాట్లాడుతూ పూర్ణమార్కెట్‌నూ పీపీపీ కింద అభివృద్ధి చేయాలని అజెండాలో పెట్టారని, దీనివల్ల ఎంతో మంది వ్యాపారులు నష్టపోతారన్నారు. ముడసర్లోవ భూములపై కన్నేసిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాలపై స్థలం చుట్టూ రూ.9కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నారన్నారు.

* తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో ముడసర్లోవ స్థలాలను గ్రీన్‌ఛానల్‌గా చూపారని, విజయసాయిరెడ్డి కన్నేసిన తర్వాత వాటిని గ్రీన్‌ఛానల్‌ నుంచి తొలగించారన్నారు. - తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.శ్రీభరత్‌, దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, నాయకులు విజయ్‌, లొడగల కృష్ణ, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్‌, గొలగాని వీరారావు, శరగడం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

* ముడసర్లోవ భూములను ప్రయివేటుకు అప్పగించడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ బి.గంగారావు అన్నారు. జీవీఎంసీ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి పాలకవర్గ సభ్యులు ప్రయత్నించడం దారుణమన్నారు. పూర్ణమార్కెట్‌ ప్రయివేటీకరణతో బడా వ్యాపారులకు లాభం కలుగుతుందని, చిరు వ్యాపారులు నష్టపోతారన్నారు. సీపీఐ నాయకులు ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని