logo

వెంటాడిన మృత్యువు

అమ్మ చనిపోయిందనే విషయం తెలియడంతో ఎంతో ఆవేదనతో వెళ్తున్న కుటుంబ సభ్యులను విధి వక్రీకరించింది. అప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్నవారిని మరింత శోకసంద్రంలో ముంచింది.

Published : 02 Feb 2023 05:02 IST

అంత్యక్రియలకు వెళ్తుండగా దుర్ఘటన
భార్య దుర్మరణం...విషమంగా భర్త పరిస్థితి

రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: అమ్మ చనిపోయిందనే విషయం తెలియడంతో ఎంతో ఆవేదనతో వెళ్తున్న కుటుంబ సభ్యులను విధి వక్రీకరించింది. అప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్నవారిని మరింత శోకసంద్రంలో ముంచింది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వారంతా అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ ఎస్సై ఖలీల్‌ పాషా తెలిపిన వివరాల మేరకు... మహారాష్ట్రలోని లాథూర్‌జిల్లా నీలంగా ప్రాంతానికి చెందిన చెందిన వెంకటగణపతి(45) విశాఖపట్నంలో రక్షణశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో మాతృమూర్తి చనిపోయిన విషయం తెలియడంతో మంగళవారం విశాఖపట్నం నుంచి భార్య జయశ్రీ(40), ఇద్దరు పిల్లలు విరాట్‌(11), శ్రియ(9)తో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు. వారిని శంషాబాద్‌నుంచి కారులో తీసుకెళ్లడానికి వెంకటగణపతి బావమరది సతీష్‌ సోలంకి, డ్రైవర్‌ ముస్తఫాషేక్‌తో కలిసి మహారాష్ట్ర నుంచి విమానాశ్రయానికి వచ్చాడు. అంతా కలిసి స్వగ్రామానికి బయలుదేరగా బాహ్యవలయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో జయశ్రీ, డ్రైవర్‌ ముస్తఫాషేక్‌ అక్కడికక్కడే మృతిచెందాగా.. మిగిలిన నలుగురు గాయపడ్డారు. జయశ్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు పలువురు బుధవారం ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు వెంకటగణపతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మిగతావారు కాస్త కోలుకున్నారని ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని