logo

అధికార పక్షంలో అసమ్మతి స్వరాలు

మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గాన్ని శాసించేలా ముగ్గురు, నలుగురు తీసుకుంటున్న నిర్ణయాలను అధికారపక్షంలో ఉన్న పలువురు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తుండటంతో అధికార వైకాపాలో కలవరం మొదలైంది.

Updated : 02 Feb 2023 06:07 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గాన్ని శాసించేలా ముగ్గురు, నలుగురు తీసుకుంటున్న నిర్ణయాలను అధికారపక్షంలో ఉన్న పలువురు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తుండటంతో అధికార వైకాపాలో కలవరం మొదలైంది. బుధవారం కౌన్సిల్‌ సమావేశంలో మెకానికల్‌ విభాగానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికార పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు వ్యతిరేకించారు. జోన్‌-6 నుంచి చెత్త తరలించడానికి ఆర్నెళ్లకు రూ.1.70కోట్లు ప్రతిపాదించగా, జోన్‌-4 నుంచి రూ.1.40కోట్లు ప్రతిపాదించడంపై 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేష్‌ ప్రశ్నించారు. 66వ వార్డు కార్పొరేటర్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌ మాట్లాడుతూ టీఎంఎక్స్‌ 20 వాహనాల నిర్వహణకు రూ.80లక్షలు కేటాయించారని, తన వార్డుకు ఒక్కసారి కూడా వాహనాన్ని పంపించలేదన్నారు. 9వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోరుకొండ వెంకట స్వాతిదాసు మాట్లాడుతూ రూ.కోట్లు వెచ్చిస్తున్నా చెత్త వాహనాలు ఎక్కడా కానరావడం లేదన్నారు. 70వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి రామచంద్రరావు కూడా డంపింగ్‌యార్డుకు చెత్త తరలింపు టెండర్లపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. 31వ వార్డు కార్పొరేటర్‌ బిపిన్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ తన వార్డులో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని, జేసీబీలు, టీఎంఎక్స్‌ 20 వాహనాలను తనెప్పుడూ చూడలేదన్నారు. వారు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇవ్వకుండా వైకాపా ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు సూచనల మేరకు మేయరు ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని