logo

56 ప్రతిపాదనలు.. 10 నిమిషాల్లో ఆమోదం

మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం బుధవారం వాడివేడిగా కొనసాగింది. మునుపెన్నడూలేని విధంగా 120 అంశాలను ప్రతిపాదించి జీవీఎంసీ అధికారులు రికార్డు సృష్టించారు.

Updated : 02 Feb 2023 06:08 IST

ఇదీ కౌన్సిల్‌లో అధికార వైకాపా తీరు
మీడియాను నియంత్రించే యత్నం

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయరు గొలగాని  హరి వెంకట కుమారి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం బుధవారం వాడివేడిగా కొనసాగింది. మునుపెన్నడూలేని విధంగా 120 అంశాలను ప్రతిపాదించి జీవీఎంసీ అధికారులు రికార్డు సృష్టించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు సమావేశం కొనసాగింది. ప్రతిపాదనల్లో ఒకటి మినహా మిగతావన్ని ఆమోదం పొందడం మరో విశేషం. కొన్ని అంశాలను నిమిషాల్లో ఆమోదించడంతో ప్రతిపక్ష కార్పొరేటర్లు అవాక్కయ్యారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికార వైకాపా కార్పొరేటర్లు లెక్కచేయలేదు.

* సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన భాజపా సీనియర్‌ నేత పీవీ చలపతిరావు, విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్‌ ఆడారి తులసీరావులకు సభ్యులు నివాళులర్పించారు. కౌన్సిల్‌ సమావేశంలో మీడియా కోసం కేటాయించిన స్థలంలో కుర్చీలను తొలగించారు. గ్యాలరీలో విలేకర్లు కూర్చోవాలని మేయరు, కమిషనర్‌ సూచించారు. ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. 10 నిమిషాల తరువాత యథావిధిగా కుర్చీలను ఏర్పాటు చేశారు.

* హెల్త్‌ సిటీలోని 2.83 ఎకరాల స్థలంలో వాకింగ్‌ ట్రాక్‌, బల్లలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఆ స్థలం జీవీఎంసీకి దఖలు పడేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారని, ఆ స్థలంలో ఇండోర్‌ స్టేడియం నిర్మించడానికి ప్రతిపాదనలు పెట్టాలని కోరారు. దీనికి మేయరు అంగీకరించారు.

* నగరంలో జీ-20 సన్నాహక సదస్సు పేరుతో కొన్ని ప్రాంతాలకే అభివృద్ధిని పరిమితం చేయడం సరికాదని తెదేపా కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముందుగా పనులు చేస్తే, తరువాత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని కమిషనర్‌ రాజాబాబు తెలిపారు. అనంతరం జీ-20 సదస్సుకు సంబంధించి అజెండాలో 28 నుంచి 48 వరకు ఉన్న అంశాలను ఆమోదిస్తున్నట్లు మేయరు ప్రకటించారు.

* నగరంలో సర్వే చేసి భూహక్కులు కల్పించే పథకానికి జీవీఎంసీ నిధులు ఎలా బదలాయిస్తారని తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ ప్రశ్నించారు. రూ.2.07కోట్లతోనే సర్వే పూర్తవుతుందా అంటూ నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.76కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టులు ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందా అని సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ గంగారావు ప్రశ్నించారు. జీవీఎంసీ నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ధ్వజమెత్తారు.

రూ.15వేల వేతనం పెంపు వాయిదా: ఉద్యాన విభాగంలో పలువురి సిబ్బంది వేతనం రూ.27వేల నుంచి రూ.42వేలకు పెంచే ప్రతిపాదన చేర్చడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రూ.16లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయని సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ గంగారావు తెలిపారు. దీంతో ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయరు ప్రకటించారు.

* బీఆర్టీఎస్‌ రహదారిలో అడవివరం నుంచి గోశాల వరకు 2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని 98వ వార్డు కార్పొరేటర్‌ పిసిని వరహా నరసింహం కోరారు. దీనిపై సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మేయరు హామీ ఇచ్చారు. మెకానికల్‌ విభాగంలో వాహనాలకు భారీగా ధరలు పెంచే ప్రతిపాదనలపై అభ్యంతరాల నడుమ మేయర్‌ ఆమోదం తెలిపారు. అనుబంధ అజెండాలోని 40 అంశాలు, టేబుల్‌ అజెండాలోని 16.. మొత్తం 56 ప్రతిపాదనలపై పూర్తిగా చర్చించకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఆమోదం తెలపడం గమనార్హం. సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని