logo

మెరిసిన ఆలోచన

మధురవాడ రిక్షాకాలనీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభ పాఠశాల/కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ‘డాక్టర్‌ రాడ్‌ రోబో’ నమూనా రూపొందించి ప్రతిభ చాటారు.

Published : 02 Feb 2023 05:22 IST

రోబో నమూనాతో గుర్తింపు
మధురవాడ గురుకుల విద్యార్థినుల ప్రతిభ

విద్యార్థినులను అభినందిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున. చిత్రంలో గురుకులాల సమన్వయకర్త రూపవతి, ఏటీఎల్‌ ఇన్‌ఛార్జి రాంబాబు

కొమ్మాది, న్యూస్‌టుడే: మధురవాడ రిక్షాకాలనీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభ పాఠశాల/కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ‘డాక్టర్‌ రాడ్‌ రోబో’ నమూనా రూపొందించి ప్రతిభ చాటారు. నీతిఆయోగ్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు సంయుక్తంగా నిర్వహించిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌-2022’కు వివిధ రాష్ట్రాల నుంచి 16వేల మంది విద్యార్థులు 7వేల నమూనాలను పంపించారు. మొదటి విడతలో ఎంపికైన 350 నమూనాల్లో ఈ గురుకులానికి చెందిన వై.జెస్సిక (10వ తరగతి), కె.వర్షిణి ప్రియాంక (9వ తరగతి), కె.రేష్మాబిందు (9వ తరగతి) రూపొందించిన ‘డాక్టర్‌ రాడ్‌ రోబో’ నమూనాకు చోటు  దక్కింది. 350 నమూనాల విద్యార్థులకు రెండు, మూడు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించగా ‘టాప్‌-10’లో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది జనవరి 9 నుంచి 14 వరకు బెంగళూరులో డెల్‌ టెక్నాలజీస్‌, లెర్నింగ్‌ లింక్‌ ఫౌండేషన్‌ సంస్థలు ఆహ్వానించగా పదోతరగతి విద్యార్థిని వై.జెస్సిక నేరుగా, వర్షిణి ప్రియాంక, రేష్మాబిందులు వీడియో కాన్ఫరెన్స్‌లో రోబో పనితీరును వివరించి టాప్‌-4లో నిలిచారు.
కలెక్టర్‌ ప్రశంసలు: మారుమూల ప్రాంతాల్లో రోగులకు ప్రాథమిక రోగాలు (జ్వరం, దగ్గు, జలుబు తదితర..) వస్తే వాటికి సంబంధించిన మందులను డాక్టర్‌ రాడ్‌(ఆర్‌ఏడీ- రోబో అసిస్టెంట్‌ ఫర్‌ డాక్టర్‌)రోబో తెలిపేలా రూపకల్పన చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈ నమూనా పనితీరును వివరించారు. విద్యార్థినులను, గైడ్‌, ఏటీఎల్‌ ఇన్‌ఛార్జి టి.రాంబాబును  కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌ అభినందించారు. గురుకులాల సమన్వయకర్త ఎస్‌.రూపవతి, ప్రిన్సిపల్‌ నిర్మల పాల్గొన్నారు.


మరిన్ని హంగులతో తీర్చిదిద్దనున్నాం..
-వై.జెస్సిక, కె.వర్షిణిప్రియాంక, కె.రేష్మాబిందు

కోరిన ట్యాబ్లెట్‌ రోబో వద్దే రోగి తీసుకునేలా హంగులు అద్దనున్నాం. వైద్యునికి వీడియో కాల్‌ చేసేలా, వైద్యుడు ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోయినా వైద్యసేవలు అందేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నమూనాను మెరుగుపరుస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని