logo

282 ఎకరాలు.. అప్పగింతే!!

ముడసర్లోవలో 282 ఎకరాల భూమిని పీపీపీ( ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేసేందుకు.. ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే పాలకవర్గం ఆమోదం తెలిపింది.

Updated : 02 Feb 2023 06:03 IST

ప్రతిపక్షాలు అడ్డుకున్నా కనిపించని ఫలితం
‘ప్రైవేటు’ చేతికి ముడసర్లోవ భూములు
తోపులాటల మధ్య కౌన్సిల్‌లో ఆమోదం

మేయరు పోడియం ముందు బైఠాయించిన ప్రతిపక్ష కార్పొరేటర్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ముడసర్లోవలో 282 ఎకరాల భూమిని పీపీపీ( ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేసేందుకు.. ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే పాలకవర్గం ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నా...ఆందోళనలు చేస్తున్నా అధికార పార్టీ పట్టించుకోలేదు. బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో.. ఈ అంశంపై చర్చకు రాగానే ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. గందరగోళం మధ్య మేయరు గొలగాని హరి వెంకట కుమారి ఓటింగ్‌ నిర్వహించారు. సభలో ఉన్న వైకాపా, స్వతంత్ర అభ్యర్థులు 45 మంది అనుకూలంగా చేతులు ఎత్తారు. తెదేపా, ఇతర కార్పొరేటర్లు 22 మంది వ్యతిరేకించారు. మెజారిటీ సభ్యులు అంగీకరించడంతో ప్రతిపాదనను ఆమోదించినట్లు మేయర్‌ ప్రకటించారు.

పోడియంను చుట్టుముట్టినా: సమావేశం ప్రారంభమైన తర్వాత అనుబంధ అజెండాలో 49వ అంశంగా వచ్చిన ‘ముడసర్లోవ’ భూముల అప్పగింత అంశం చదవాలని కార్యదర్శి నల్లనయ్యకు మేయరు సూచించారు. ఆయన చదువుతుండగా సీపీఎం, సీపీఐ ఫ్లోర్‌ లీడర్లు గంగారావు, స్టాలిన్‌, జనసేన కార్పొరేటర్లు భీశెట్టి వసంతలక్ష్మి, పీతల మూర్తియాదవ్‌, దల్లి గోవిందరెడ్డి తమ స్థానాల్లో నిల్చుని ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా కార్యదర్శి ఆ అంశాన్ని చదువుతుండటంతో తెదేపా, జనసేన, ఇతర కార్పొరేటర్లు మేయరు పోడియాన్ని చుట్టుముట్టారు. వారిని అడ్డుకోవడానికి వైకాపా కార్పొరేటర్లు వచ్చి వలయంగా ఏర్పడ్డారు. అయినా ప్రతిపక్ష కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది.

చేతులెత్తి మద్దతు తెలుపుతున్న వైకాపా కార్పొరేటర్లు

పూర్ణమార్కెట్‌పై వెనుకడుగు..

పూర్ణమార్కెటను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే అంశంపై అధికార పక్షం వెనుకడుగు వేసింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన తరువాత అధికారులు సవరించిన అంశంగా ప్రత్యేక అజెండా కాపీని అందజేశారు. అందులో పూర్ణమార్కెట్‌ను జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌ (సవివర పథక నివేదిక) తయారు చేయడానికి అనుమతి కోరారు. ప్రాజెక్టు నిర్మాణ దశలో పర్యవేక్షణ, సమన్వయానికి అవసరమైన ఏజెన్సీ కోసం ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) పిలవనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని