logo

ప్రగతికి ఊతమిచ్చేలా.. మధ్యతరగతి మురిసేలా!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పలు వర్గాలను మెప్పించగా, కొన్ని వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆదాయపన్ను స్లాబుల్లో మార్పులు, పరిమితి పెంచడం మధ్యతరగతి, వేతన జీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 Feb 2023 05:28 IST

కేంద్ర బడ్జెట్‌లో పలు వర్గాలకు ఊరట
శ్రీఅన్న పేరుతో చిరుధాన్యాలకు ప్రోత్సాహం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పలు వర్గాలను మెప్పించగా, కొన్ని వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆదాయపన్ను స్లాబుల్లో మార్పులు, పరిమితి పెంచడం మధ్యతరగతి, వేతన జీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఉపాధిహామీ పథకం, రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా సబ్సిడీ కేటాయింపులు తగ్గించడంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. వివిధ శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రోత్సాహాకాలకు గతేడాది కంటే కొంతమేర నిధులు పెంచారు.

మధ్యతరగతికి ఊరట: ఆదాయపన్ను పరిమితిని రూ.7 లక్షల వరకు పెంచడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభించింది. కొత్త ఆదాయపన్ను విధానంలో నెలకు రూ.62 వేల జీతం (గ్రాస్‌) లేదా ఆదాయం పొందిన వారు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు పన్ను మినహాయింపులోకి రానున్నారు.

వ్యవ‘సాయం’ అందే విధంగా..

గతేడాది పంట ఉత్పతిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) ఏర్పాటును ప్రోత్సహిస్తూ రూ.500 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.955 కోట్లకు పెంచారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటల రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలను ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. నిధుల కేటాయింపు పెంచడంతో మరిన్ని సంఘాలు ముందుకొచ్చే అవకాశం ఉంది.  చిరుధాన్యాల పంటలకు విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు శ్రీఅన్న పేరుతో సహకరిస్తామని తాజాగా పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వన్‌ధన్‌ వికాస కేంద్రాలు, పంట ఉత్పత్తిదారుల సంఘాలతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీరికి మరింత నైపుణ్య శిక్షణ అందివ్వడానికి అవకాశం ఉంది.

* చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి గతంలో రూ.259.83 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఏడాది రూ.400 కోట్లు కేటాయించారు. గోవాడ చక్కెర కర్మాగారంలో ఈ యూనిట్‌ ఏర్పాటుకు నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నీ ఖాదీ, పీచు పరిశ్రమలకు కేటాయింపులు రూ.824 కోట్ల నుంచి రూ.1289 కోట్లు పెరిగాయి. జిల్లాలో చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

* సమగ్ర శిక్ష ద్వారా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాల పెంచేందుకు శిక్షణ ఇచ్చే నిధులు రూ.550 కోట్లు నుంచి రూ.800 కోట్లుకు పెంచారు. అలాగే పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలలో అభివృద్ధికి ఈ ఏడాది రూ.400 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 700కు పైగా పాఠశాలలు పీఎంశ్రీ పథకానికి అర్హత సాధించాయి. వీటి అభివృద్ధికి నిధులు అందుబాటులోకి రానున్నాయి.


మత్స్య అభివృద్ధికి మరిన్ని అవకాశాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.6వేల కోట్ల నిధులు కేటాయించడంతో జిల్లాలో మత్స్యశాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పీఎంఎంఎస్‌వై కింద గత రెండేళ్ల నుంచి మత్స్యకారులకు భిన్న రకాల ప్రాజెక్టులు అందుతున్నాయి. ఏడాదికి ఆయా పథకాలకు రాయితీలు ఇచ్చేందుకు రూ.1.28 కోట్ల మేర జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సంలో కూడా భారీగానే యూనిట్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది.


తగ్గిన కేటాయింపులు..

* ఉపాధిహామీ పథకానికి గతేడాది కంటే రూ.29 వేల కోట్లు తగ్గించారు. రూ 89 వేల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.60 వేల కోట్లకు నిధులు తగ్గించారు. దీంతో ఈ పనులపై ఆధారపడిన శ్రమజీవులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాదే చాలావరకు పనిదినాలు తగ్గించేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పని దినాలు తగ్గే సూచనలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

* ఈ ఏడాది యూరియాపై సబ్సిడీని బాగా తగ్గించారు. గతేడాది 1.54 లక్షల కోట్ల రాయితీగా కేటాయిస్తే ఈసారి రూ.1.31 లక్షల కోట్లకు తగ్గించారు. దీంతో యూరియా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ప్రపంచ దేశాలతో పోటీకి ప్రణాళికాబద్ధంగా రూపకల్పన

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: దేశ పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉందని ఎంపీ బి.వి.సత్యవతి పేర్కొన్నారు. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను ఉంచడానికి ఎంతో ప్రణాళికాబద్ధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు కనిపిస్తోందన్నారు. ముందెన్నడూ లేనివిధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. పర్యావరణహిత సంస్థలు, పరిశ్రమలు, వాహనాలకు ప్రోత్సాహకాలు పెంచడం వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. వృద్ధులు, మహిళలకు ఈ బడ్జెట్‌తో మేలు జరుగుతుందన్నారు.  రాష్ట్ర పునర్విభజనలో పేర్కొన్న అంశాలు, రాష్ట్రానికి రావాల్సి రాయితీల కోసం ఎంపీలంతా పోరాడతామని వివరించారు.


రక్షణకు నిధులు పెంచడం మంచిదే
- జి.సత్తిబాబు, వాణిజ్యశాస్త్ర అధ్యాపకుడు

చైనా వంటి దేశాల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. రక్షణ రంగ బడ్జెట్‌ రూ. 5.94 లక్షల కోట్లకు పెంచారు. దీనివల్ల ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు వీలవుతుంది. డిజిటల్‌ సర్వీస్‌లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చి సుమారు 39 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం మంచి పరిణామం,. పరిశోధనలకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహాలు అందించారు.


కొత్త పన్ను స్లాబులు బాగున్నాయి
- బి.కృష్ణకుమార్‌, ఆడిటర్‌

రూ. 3 లక్షల వరకు పన్ను  ఉండదని ప్రకటించారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. 3 లక్షల పైబడి రూ. 15 లక్షల వరకు స్లాబు రేట్లు తక్కువగానే ఉన్నాయి. దేశీయంగా వస్తు తయారీని ప్రోత్సహించేలా బడ్జెట్‌లో అంశాలను రూపొందించారు.  చిరుధాన్యాలను ప్రోత్సహించేలా నిధులు కేటాయించడం మంచి ఆలోచన. మహిళలు, బాలికల కోసం కొత్త పొదుపు పథకాలు బాగున్నాయి.


ఆశాజనకమే
- కొణతాల రాజేంద్ర, అనకాపల్లి బంగారు వర్తక సంఘ అధ్యక్షుడు

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగానే ఉంది. దిగుమతి చేసుకునే బంగారం ధరలు తగ్గుతాయి. బంగారం, వెండిపై కస్టమ్‌ సుంకాన్ని పెంచారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేలా ల్యాబ్‌లో వజ్రాలు తయారు చేసేందుకు ఉపయోగించే సీడ్స్‌పై సుంకాన్ని తగ్గించారు. ఇంటి నిర్మాణాలకు ప్రోత్సహించేలా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిధులు పెంచారు. దీనివల్ల నిర్మాణ రంగం ఊపందుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని