logo

‘కార్మికుల ఆరోగ్యాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం’

విశాఖపట్నంలో కేంద్రం మంజూరు చేసిన 500 పడకల ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆసుపత్రి సామర్థ్యం భూ సమస్య వల్లే 350కి తగ్గిందని కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి రాజ్యసభలో వెల్లడించారు.

Published : 03 Feb 2023 03:07 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో కేంద్రం మంజూరు చేసిన 500 పడకల ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆసుపత్రి సామర్థ్యం భూ సమస్య వల్లే 350కి తగ్గిందని కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి రాజ్యసభలో వెల్లడించారు. గురువారం ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో.. ఆసుపత్రి పడకల సామర్థ్యం గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. విశాఖలో సిబ్బంది నివాసాలకు అదనపు స్థలం అందుబాటులో లేకపోవడంతో 350 పడకల ఆసుపత్రిగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రికి మొత్తం రూ.384.26 కోట్లు మంజూరవగా.. 28.10.2022న ఈఎస్‌ఐసీ పేరిట భూమిని కేటాయించామని, పనులు ప్రారంభం, పూర్తయ్యే తేదీని నిర్ణయించడం, భూవినియోగ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అలాగే విశాఖలోని మల్కాపురంలో ప్రస్తుతం 125 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రి మరమ్మతులో ఉందని, అచ్యుతాపురంలో మరో 30 పడకల ఆసుపత్రికి ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రంలో గుంటూరు, నెల్లూరు, పెనుకొండ, శ్రీసిటీలో మరో ఎనిమిది ఈఎస్‌ఐ ఆసుపత్రులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. దీనిపై జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ ఆసుపత్రులు మంజూరైనా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విశాఖతోపాటు  ఇతర నగరాల్లో సంఘటిత కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు అందడంలేదని, వారి ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని