logo

అజెండాలోని అంశాలపై ఫిర్యాదు చేస్తాం: తెదేపా

మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాల అజెండా అంశాలపై విజిలెన్స్‌, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 03 Feb 2023 04:36 IST

సమావేశంలో తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, తదితరులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాల అజెండా అంశాలపై విజిలెన్స్‌, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతి అంశంలోనూ అధికార పార్టీ సభ్యులకు పర్సంటేజీలుండేలా అజెండా రూపొందిస్తున్నారన్నారు. ముడసర్లోవలో భూములు విజయసాయిరెడ్డికి అప్పగించే విధంగా కౌన్సిల్‌ చర్య తీసుకుని పీపీపీ తరహాలో అభివృద్ధంటూ ప్రకటించడం సరికాదన్నారు. బ్రిటిష్‌కాలం నాటి రిజర్వాయర్‌ వల్ల తాగునీరు రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలవారికి అందుతుందని, థీమ్‌ పార్కులు నిర్మిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయన్నారు. రిజర్వాయర్‌ చుట్టూ ఉన్న స్థలాల పరిరక్షణ కోసం రూ.9కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మించి ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజాధనం వృథాగా భావిస్తున్నామన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో అధికారులకు బదులుగా కమిషనర్‌ సమాధానం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మెకానికల్‌ విభాగంలో చేసిన ప్రతిపాదనలు గుత్తేదారులకు అనుకూలంగా ఉన్నాయని, వాటి వల్ల అధికార పార్టీ కార్పొరేటర్లకు భారీగా నిధులు సమకూరుతాయన్నారు. 67వ వార్డు కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార పార్టీ కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. గాజువాక మార్కెట్‌ వద్ద జీవీఎంసీ గుర్తు ఉన్న టికెట్లతో పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నారని, గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యల్లేకపోవడం వెనుక జోనల్‌ కమిషనర్‌ సింహాచలం ఉన్నారన్న అనుమానాలున్నాయన్నారు. ఉద్యానవన విభాగంలో ఉద్యోగుల వేతనాలు ఒకేసారి పెంచడం వెనుక కొందరు వసూళ్లకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. 15ఏళ్లుగా ఒక అధికారిని ఇక్కడ ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. 38వ వార్డు కార్పొరేటర్‌ గోడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన వార్డులో ఆర్నెల్ల క్రితం శంకుస్థాపన చేసిన పని నేటికీ ప్రారంభించలేదన్నారు. విలేకరుల సమావేశంలో శరగడం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని