logo

మత్స్యకారులకు అండగా..

మత్స్యకారులకు మరింత చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అవసరమైన సదుపాయాలను రాయితీపై సమకూర్చుతోంది.

Updated : 03 Feb 2023 04:37 IST

ఇటీవల లబ్ధిదారులకు మినీ వ్యాన్‌ అందించిన కలెక్టర్‌

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి: మత్స్యకారులకు మరింత చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అవసరమైన సదుపాయాలను రాయితీపై సమకూర్చుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో పలు యూనిట్లను అధికారులు అందించారు.
సాగర మత్స్యకార సొసైటీలు 20, స్వదేశీ మత్స్యకార సొసైటీలు 20, మహిళా సొసైటీలు 14 ఉన్నాయి. వీటి పరిధిలో 9344 మంది సభ్యులున్నారు. సుమారు 30 వేల కుటుంబాలున్నాయి. వేట ద్వారా మత్స్యకారులు భారీగా సంపదను పట్టి తెస్తున్నారు. అయితే విక్రయించడానికి సరైన మార్గాలు కనిపించడం లేదు. తక్కువ ధరకు దళారులకే అప్పగించాల్సి వస్తోంది. వీరే నేరుగా అమ్ముకోగలిగితే మరింత మేలు జరుగుతుందని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంఎంఎస్‌వై కింద కేంద్రమే వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తోంది. ప్రధానంగా మత్స్య ఉత్పత్తితో పాటు, దీని వినియోగం పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2020లో దేశంలో సగటు మత్స్యసంపద వినియోగం ఏడాదికి ఓ వ్యక్తికి తొమ్మిది కేజీలు ఉండగా, 2025 నాటికి ఇది 30 కేజీలకు చేరాలనేది లక్ష్యం. కొవిడ్‌ తర్వాత వీటి వినియోగం పెరిగినా, అనుకున్న స్థాయిలో చేరలేదు. నాణ్యతతో కూడిన సరకు లభించకపోవడం అనేది ప్రతికూలంగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి కొత్త పథకం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

సహకారం ఇలా.. కొత్త పథకం కింద వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోడానికి వీలుగా సరకు రవాణాకు వాహనాలు, నిల్వకు పెట్టెలు ఇస్తున్నారు. చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారు.

మినీ వ్యాను: దీని విలువ రూ. 20 లక్షలు. ఇందులో చేపలు, రొయ్యలు, పీతలు తదితర వాటిని నిల్వ చేసి నచ్చిన ప్రాంతాలకు రవాణా చేయొచ్చు. ఇటీవలే రేవుపోలవరానికి చెందిన ఓ మత్స్యకారుడికి కలెక్టర్‌ వాహనాన్ని అందించారు.

ద్విచక్ర వాహనం: టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంతో పాటు, సరకు నిల్వ కోసం ఐస్‌ పెట్టెను ఇస్తారు. యూనిట్‌ విలువ రూ. 75 వేలు. ఇంత వరకు వీటిని జిల్లాలో 28 వరకు అందించారు. చెరువులు, జలాశయాల్లో వేట చేసే వారికి ఇది బాగా ఉపయోగపడటంతో వీరే అధికంగా తీసుకున్నారు.

కొరుప్రోలులో ప్రారంభించిన విక్రయకేంద్రం

చేప పిల్లలు: అనుమతిపొందిన జలాశయాల్లో చేపలు పెంచడానికి రాయితీలను ఇస్తున్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకైతే 60శాతం..ఓబీసీలు, ఇతరులకైతే 40శాతం రాయితీ వర్తిస్తుంది. వీటితో పాటు హబ్‌, ఫిష్‌ కియోస్క్‌ తదితర పథకాలున్నాయి. వీటికి రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు వెచ్చించాలి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేస్తే అర్హత ఆధారంగా కేటాయిస్తారు.

మినీ ఫిష్‌ రిటైల్‌ ఔట్లెట్‌:  చేపల విక్రయశాలకు రూ. 1.75 లక్షలు కేటాయిస్తున్నారు. ఇటీవలే కొరుప్రోలులో అందుబాటులోకి తెెచ్చారు. సబ్బవరంలోనూ సిద్ధంగా ఉంది. మరో రెండు వారాల్లో జిల్లాలో 22 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

ఉపాధి అవకాశాలు పెంపు:  మత్స్యసంపద వినియోగం పెంచడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన సరకు, ఉత్పత్తి దారులకు మంచి ధర ఇవ్వాలనేది లక్ష్యం. హబ్‌లు పెట్టడం ద్వారా ఔట్‌లెట్‌లకు సరకు సరకు సరఫరా చేస్తారు. 152 మందిని ఔట్‌లెట్‌లు కోసం గుర్తించగా, 65 మందికి అనుమతులు ఇచ్చాం. అవసరమైన వారికి డీసీసీబీ రుణసాయం చేస్తోంది.

పి.లక్ష్మణరావు, జేడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని