logo

100 అంశాలతో..స్థాయీ సమావేశం

మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని 100 అంశాలతో నిర్వహించడానికి అజెండా కాపీలను సభ్యులకు జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య గురువారం అందజేశారు.

Updated : 03 Feb 2023 04:40 IST

శనివారం ఉదయం 11 గంటలకు..

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని 100 అంశాలతో నిర్వహించడానికి అజెండా కాపీలను సభ్యులకు జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య గురువారం అందజేశారు. రికార్డు స్థాయిలో 120 అంశాలతో బుధవారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి చరిత్ర సృష్టించిన అధికారులు, ఏకంగా 100 అంశాలతో స్థాయీ సమావేశం నిర్వహించడానికి అజెండా అందజేసిన అధికారులు.. టేబుల్‌ అజెండాగా ఇంకా ఎన్ని అంశాలను చేర్చనున్నారో అనే చర్చ సాగుతోంది. శనివారం ఉదయం 11 గంటలకు స్థాయీ సమావేశం ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కానుంది.

* జి-20 సన్నాహక సదస్సులు నేపథ్యంలో రూ.49లక్షల్లోపు పనులను స్థాయీ అజెండాలో చేర్చారు. రహదారుల పునరుద్ధరణ, నడక మార్గాల అభివృద్ధి, రహదారిపై రంగులు, విద్యుద్దీపాలంకరణ వంటి అంశాలను చేర్చారు. విద్యుత్తు స్తంభాలకు, చెట్లకు విద్యుత్తు దీపాలు అమర్చేలా ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నగరానికి వచ్చిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి రూ.4.81లక్షలు వ్యయం చేసినట్లు ప్రతిపాదించారు. ప్రధాని వచ్చి నాలుగు నెలలు అవుతుండగా ఇప్పుడు ఆయా పనులను ప్రతిపాదించడం అనుమానాలు రేపుతోంది.  భవన నిర్మాణ వ్యర్థాలు తరలించడానికి రూ.12లక్షల వరకు ప్రతిపాదించారు. కొన్ని అంశాలలో ఎక్కడ, ఎన్ని పనులు చేస్తున్నామో కూడా కనీసం ప్రచురించకపోవడం గమనార్హం. విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్స్‌, పైవంతెన పిల్లర్లకు రంగులు వేయడానికి రూ.48.50లక్షలతో ప్రతిపాదించారు. షీలానగర్‌ నుంచి ఆర్‌అండ్‌బీ కాలనీ వరకు విభాగినుల మరమ్మతులకు రూ.31 లక్షలతో ప్రతిపాదించారు.

* గతంలో అద్దెకు... ఇప్పుడు కొనుగోలు: నగరంలో ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగినప్పుడు అద్దె ప్రాతిపదికన సీరియల్‌సెట్స్‌ పెడుతుండేవారు. జి-20 సన్నాహక సదస్సుల నిర్వహణ కోసం రూ.29.20లక్షల వ్యయంతో 30కేవీ సామర్థ్యం గల నాలుగు జనరేటర్లు కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు. రూ.1.38కోట్ల వ్యయంతో సీరియల్‌సెట్స్‌ కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు.


శ్మశానాలకు రూ.15.06 కోట్లు..

జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల్లో 38 శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ఏకంగా రూ.15.06 కోట్లు కేటాయించారు. గరిష్ఠంగా రూ.48.97 లక్షలు, కనిష్ఠంగా రూ.25 లక్షలు కేటాయించారు. కేవలం బర్నింగ్‌ఫ్లాట్‌ ఫాం, ప్రహరీ, చిన్న వేచి ఉండే గది నిర్మాణానికి రూ.49 లక్షల వరకు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నగర శివారులో ఆయా పనులు ప్రతిపాదించారు. ఆరిలోవ, భీమిలి, మధురవాడ, పెందుర్తి, గోపాలపట్నం పరిసరాల్లో శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. ఒకేసారి శ్మశానాల అభివృద్ధికి రూ.15.06కోట్లు స్థాయీ సమావేశంలోనూ, కౌన్సిల్‌ సమావేశంలో మరో రూ.5కోట్లు కేటాయించడం చర్చకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని