logo

అక్రమమంటూనే చర్యలకు వెనకడుగు

జిల్లాలోని స్థిరాస్తి లేఅవుట్లలో చాలావరకు అనుమతుల్లేకుండా వేసినవేనని గుర్తించారు. ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని వారించారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులన్నీ తెచ్చుకుని అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు.

Updated : 03 Feb 2023 04:31 IST

637 లేఅవుట్లకు అనుమతి లేదని గుర్తింపు
నేతల ఒత్తిళ్లతో మిన్నకున్న అధికారులు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

అచ్యుతాపురం-అనకాపల్లి మార్గంలో చోడపల్లి సమీపంలో అనుమతుల్లేని ఓ లేఅవుట్‌

జిల్లాలోని స్థిరాస్తి లేఅవుట్లలో చాలావరకు అనుమతుల్లేకుండా వేసినవేనని గుర్తించారు. ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని వారించారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులన్నీ తెచ్చుకుని అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. దీనికోసం ఉమ్మడి జిల్లాలో  విజిలెన్స్‌ బృందాన్నీ నియమించారు. తీరా అక్రమ లేఅవుట్లన్నీ గుర్తించిన తర్వాత నేతల ఒత్తిళ్లతో రియల్టర్లపై చర్యలకు వెనకడుగు వేశారు..దీంతో విజిలెన్స్‌ తనిఖీల పేరుతో చేసిన హంగామా అంతా వృథా ప్రయాసగానే మిగిలిపోయింది.  

ఉమ్మడి జిల్లాలో అధికారులు గుర్తించిన అక్రమ లేఅవుట్లే 637 వరకు ఉన్నాయి. ఇంకా గుర్తించనివి చాలానే ఉన్నాయి. ఒక్క నర్సీపట్నం డివిజన్‌లోనే 560 ఎకరాల్లో పుట్టగొడుగుల్లా అనధికారిక లేఅవుట్లు వెలిశాయి. పట్టణానికి సమీపంలో ఎకరం ధర రూ.కోట్లలో పలుకుతోంది. దీంతో పంట పొలాలను చదునుచేసి మట్టిని పోసి, రాళ్లు పాతి ప్లాట్లుగా చూపుతున్నారు. ధర్మసాగరం పంచాయతీల పరిధిలో రెండేసి, చెట్టుపల్లి, కేఎల్‌పురం ప్రాంతాల్లో రెండు లే-అవుట్‌లకు అనుమతులు లేవు.

* సంపతిపురంలో కొన్ని లే అవుట్‌లకు గెడ్డలను కప్పేసి రహదారి నిర్మాణాలు చేపట్టారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరులో మూడు, తిమ్మాపురంలో ఏడు, నక్కపల్లిలో 15 వరకు అనధికారిక లేఅవుట్లున్నాయి. విజిలెన్స్‌ తనిఖీల్లో గుర్తించినా ఇప్పటి వరకు వాటిపై చర్యలు చేపట్టలేదు.  

* అనకాపల్లికి సమీపంలోని బవులవాడలో అధికార పార్టీ నాయకుడి అండతో అనధికార లేఅవుట్‌ వేశారు. సత్యనారాయణపురం పంచాయతీలోని ఒక పెద్ద లేఅవుట్‌కి ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములను రహదారులుగా మార్చి స్థలాల అమ్మకాలు చేశారు.  


ఫిర్యాదులు చేసినా..

నర్సీపట్నం మండలంలోని గబ్బాడ పరిధిలో సుమారు పది లేఅవుట్లు వేశారు. ఒక్కదానికి కూడా అనుమతుల్లేవు. దీనిపై స్థానిక సర్పంచి రాజేశ్వరి, ఆమె భర్త రాజబాబు పలుమార్లు పంచాయతీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు డీపీవోగా ఉన్న శిరీషారాణి నర్సీపట్నం డీఎల్‌పీవోగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ లేఅవుట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. ఆ మేరకు బోర్డులు తయారుచేశారు. కార్యదర్శిపై పైస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి ఆ బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. ఆ అంశంపై పంచాయతీ నుంచి ఒత్తిడి తెచ్చినప్పుడుల్లా కార్యదర్శులను బదిలీ చేస్తున్నారే తప్ప వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల స్పందనలోనూ మరోసారి ఫిర్యాదుచేశారు.  

నర్సీపట్నం మండలం గబ్బాడ పరిధిలోని అక్రమ లేఅవుట్లలో పెట్టడానికి తయారుచేసిన హెచ్చరిక బోర్డు నెలల తరబడి కార్యాలయంలోనే మగ్గుతోందిలా..


విజిలెన్స్‌ బృందం గతేడాది గుర్తించిన అక్రమ లేఅవుట్ల వివరాలు

డివిజన్ల వారీగా....
అనకాపల్లి - 352
నర్సీపట్నం - 162
విశాఖపట్నం - 123


నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌..

* భూ వినిమయ స్థితి మార్చడానికి ముందుగానే రెవెన్యూ అనుమతులు పొందాలి.

* లేఅవుట్‌ కోసం పంచాయతీలకు దరఖాస్తుచేసి వారి ద్వారా వీఎంఆర్డీఏ అనుమతులు కోరాలి. అది వచ్చాక పంచాయతీల్లో తీర్మానం జరగాలి. ఈ క్రమంలో పంచాయతీలకు పన్ను చెల్లించాలి.

* నిర్దేశిత స్థలంలో 10 శాతం సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఆ భూమిని పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాలి.

* లేఅవుట్లలో ప్రధాన రహదారి కనీసం 30 అడుగుల వెడల్పు తగ్గకుండా ఉండాలి.


కమిషనరేట్‌కు పంపించాం..
- శిరీషారాణి, జిల్లా పంచాయతీ అధికారిణి

విజిలెన్స్‌ బృందాలు గుర్తించిన అనుమతుల్లేని లేఅవుట్ల వివరాలను కమిషనరేట్‌ కార్యాలయానికి పంపించాం. వాటి క్రమబద్ధీకరణపై వారే నిర్ణయం తీసుకుంటారు. అదే జరిగితే పంచాయతీలకు 10 శాతం స్థలం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా విజిలెన్స్‌ బృందమేదీ లేదు. పంచాయతీ స్థాయిలో కార్యదర్శులే అడ్డుకోవాలి. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని