logo

నేటి నుంచి మహిళా ఎమ్మెల్యేల సదస్సు

మహిళా ఎమ్మెల్యేల సదస్సు శనివారం నుంచి 6వ తేదీ వరకు విశాఖ కేంద్రంగా జరగనున్నది. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీ (ఎల్‌.బి.ఎస్‌.ఎన్‌.ఎ-ముసోరి) సహాయంతో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌.సి.డబ్ల్యు) ఈ సదస్సు నిర్వహిస్తోంది.

Updated : 04 Feb 2023 04:22 IST

పది రాష్ట్రాల నుంచి 40 మంది హాజరు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మహిళా ఎమ్మెల్యేల సదస్సు శనివారం నుంచి 6వ తేదీ వరకు విశాఖ కేంద్రంగా జరగనున్నది. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీ (ఎల్‌.బి.ఎస్‌.ఎన్‌.ఎ-ముసోరి) సహాయంతో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌.సి.డబ్ల్యు) ఈ సదస్సు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, మిజోరం, నాగాలాండ్‌, గోవా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర పది రాష్ట్రాల నుంచి వంద మంది శాసనసభ్యులు పాల్గొంటారని సమాచారం అందింది. అయితే 40 మంది సుముఖత చూపినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది విశాఖ చేరుకున్నారు. వీరికి బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్లో అతిథ్యం కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి మహిళా మంత్రులు విడదల రజని, ఆర్‌.కె.రోజాతోపాటు 13 మంది మహిళా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఎంత మంది వస్తున్నదీ సమాచారం రాలేదు. 6న జరగనున్న ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ అదే రోజు విశాఖ రానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం వస్తున్నారు.  


రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు నేడు

రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు శనివారం బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్లో జరగనున్నది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూ.గో., డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు సదస్సుకు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీఓలు, సబ్‌కలెక్టర్లు, సర్వేశాఖ సహాయ సంచాలకులు, ఎంపిక చేసిన తహసీల్దార్లు పాల్గొంటారు. విశాఖ జిల్లాలో 22ఎ నుంచి తమ భూములను మినహాయించాలని 2500 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇంత వరకు 250 వరకు పరిష్కరించగా, 200 వరకు తిరస్కరించారు. గతంలో సిట్‌ సిఫార్సుల మేరకు కొన్ని భూములను 22ఎలో చేర్చారు. ఆయా సిఫార్సులు ఇంత వరకు అమలు కాలేదు. రెవెన్యూ సదస్సులో ఆయా సమస్యలకు ఏమైనా పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. భూముల రీసర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలిచ్చే అవకాశం ఉంది. సదస్సులో పాల్గొనేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని