logo

దేవుడా..నీ ఆస్తులు గోవిందా!

నర్సీపట్నం ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని తిరిగి తమ అధీనంలోకి తీసుకునే విషయంలో యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది.

Published : 04 Feb 2023 05:03 IST

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

నర్సీపట్నం ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని తిరిగి తమ అధీనంలోకి తీసుకునే విషయంలో యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది. ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవి.. ఆక్రమణ నేరమని అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. కోమటి రామాలయానికి చెందిన ఆక్రమిత భూమి వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు ఇలాగే మాయమయ్యాయి. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ భూముల్లో 80 సెంట్ల విలువైన స్థలం ఆక్రమణదారుల చేతిలో ఉందని గుర్తించిన అధికారులు కేసులు పెట్టారు. దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ లోపిస్తోంది.

ప్రహసనంగా లీజులు..

నర్సీపట్నం, బలిఘట్ట్టం గ్రూపు ఆలయాల పరిధిలో వందల ఎకరాలను ఏటా లీజుకు ఇస్తుంటారు. సత్యనారాయణస్వామి, బ్రహ్మలింగేశ్వరస్వామి తదితర ఆలయాలకు 311.07 ఎకరాల భూములున్నాయి. వీటిలో 133.30 ఎకరాలను అర్చకులు, ఇతర సేవకుల అనుభవనానికి ఇచ్చారు. మిగతా వాటికి లీజు రూపంలో కేవలం రూ.6.69 లక్షలు మాత్రమే వస్తోంది. మూడేళ్లకోసారి వేలం నిర్వహిస్తున్నప్పటికీ శిస్తులు ఏటా వసూలు చేస్తుంటారు. లీజుదారులు వరి, అపరాల పంటలే వేయాలి. కొన్నిచోట్ల సరుగుడు, అరటి వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న పరిస్థితి ఉంది.
* నూకాలమ్మ ఆలయానికి చెందిన రూ.8.07 ఎకరాలకు రూ.64 వేలు, సత్యనారాయణస్వామి ఆలయ భూములకు రూ. 48 వేలు, గొలుగొండ మండలంలోని ధారమల్లేశ్వరస్వామి ఆలయ భూములు 28.52 ఎకరాలకు రూ.70 వేల ఆదాయం వచ్చింది. బలిఘట్టం బ్రహ్మనంద ఆశ్రమానికి 50 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి నుంచి రూ.1.36 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. కొంత విస్తీర్ణంలో వాణిజ్య పంటల సాగు ఉందని సమాచారం.
* నాతవరం మండలం గంగాదేవి ఆలయానికి 13.02 ఎకరాలకు రూ.1.20 లక్షలు వస్తోంది. వీబీ అగ్రహారం రామలింగేశ్వరస్వామి ఆలయానికి 46 ఎకరాలకు 9.46 ఎకరాలను లీజుకు ఇచ్చారు. ఇందుకు రూ.55 వేలు శిస్తు వస్తోంది. వాణిజ్య పంటలు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాణిజ్య పంటల ద్వారా లీజుదారులు ఆదాయం పొందుతున్నా దేవుడికి మాత్రం తక్కువగా ఇస్తున్నారు.
* బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయానికి 126.76 ఎకరాల ఆస్తి ఉంది. ఇందులో 30 ఎకరాలు ఇటీవల రూ. 1.76 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఈ విస్తీర్ణం మొత్తాన్ని లీజుదారులు రూ.లక్షలు వెచ్చించి ఇటీవల చదును చేయించారు. వాణిజ్య పంటలు వేయడానికి ఇలా చదును చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఈ భూమిలో నుంచి వెళ్తున్న కాలువ ప్రవాహన్ని మట్టితో అడ్డుకట్ట వేయడం కనిపించింది.

పరిశీలించి చర్యలు

ఆక్రమణదారులపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. సత్వర న్యాయం కోసం చూస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడిన వారంతా చట్టపరమైన చర్యలకు గురవుతారు. కొన్నిచోట్ల లీజు ద్వారా తక్కువ ఆదాయమే వచ్చింది. కారణాలను అధ్యయనం చేస్తాం. పోటీలో ఎక్కువ మొత్తం లీజు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొన్ని ఆక్రమణలను నిరోధించాం. ప్రతి ఒక్కరూ లీజు నిబంధనలు పాటించాలి. లీజు ఖరారైనప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఉల్లంఘనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.
 మురళీకృష్ణ, ఈఓ, బలిఘట్టం గ్రూపు ఆలయాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని