Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్‌ టెక్నాలజీతో జియో మ్యాటింగ్‌

విశాఖలోని రుషి కొండ (Rushikonda)ను బోడికొండగా మార్చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దానిని కవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జర్మన్‌ టెక్నాలజీతో జియో మ్యాటింగ్‌ (Jio matting) చేస్తోంది.

Updated : 04 Feb 2023 22:41 IST

విశాఖపట్నం: భవనాల నిర్మాణం పేరుతో రుషికొండ (Rushikonda) ను బోడికొండగా మార్చేసిన ప్రభుత్వం (AP Govt) ఇప్పుడు దానిని కవర్‌ చేసేందుకు తంటాలు పడుతోంది. వచ్చే నెలలో జీ20 (G20 Summit) సదస్సు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కొండ ఆకుపచ్చగా ఉండేటట్లుగా జర్మన్‌ టెక్నాలజీతో జియో మ్యాటింగ్‌ (Geo matting) చేస్తున్నారు. రుషికొండను బోడిగుండులా తొలిచేయడంపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి.. పరిమితులను మించి రాష్ట్ర ప్రభుత్వం కొండలను తొలిచేసిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై గూగుల్‌ మ్యాప్‌లను సాక్ష్యాలుగా పరిగణించాలని న్యాయస్థానానికి అభ్యర్థించారు. ఈ తరుణంలో జియో మ్యాటింగ్‌ చేయడం చర్చనీయాంశమైంది.

అత్యంత ఖరీదైన ఈ మ్యాట్‌ను తొలుత కొండపై ఓ చోట పరిచారు. అక్కడ వృక్షజాలం పచ్చదనం పెరగడం కోసం ఇది తోడ్పడుతుందని అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ..ఒకవైపు జియో మ్యాట్‌ను పరిచే పని చేపట్టారు. కొద్ది రోజుల్లోనే మిగతా భాగాల్లోనూ పరుస్తామని చెబుతున్నారు. దీనివల్ల తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, పచ్చదనం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం జీ20 సదస్సును దృష్టిలో పెట్టుకొని ఇవి చేయడం లేదని, కొండ పరిరక్షణలో భాగంగానే చెయ్యాలని నిర్ణయించామంటున్నారు. రెండు నెలల క్రితమే ప్రయోగాత్మకంగా ఓ చోట జియో మ్యాట్‌ వేశామని, సత్ఫలితాలు రావడంతో మిగిలిన ప్రాంతానికీ విస్తరిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని