logo

కొబ్బరిచెట్లకు రూ.48లక్షలతో దీపాలంకరణ

నగరంలో కొబ్బరి చెట్లకు రూ.48లక్షలతో దీపాలంకరణ చేయడం ఏమిటీ? అనుకుంటున్నారా. ఇది నిజమే.. మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు స్థాయీ సంఘ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించారు.

Updated : 05 Feb 2023 04:06 IST

స్థాయీ సంఘ సమావేశంలో నిర్ణయం
103 అంశాలకు సభ్యుల ఆమోదం

స్థాయీ సంఘ సమావేశంలో పాల్గొన్న మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, సభ్యులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలో కొబ్బరి చెట్లకు రూ.48లక్షలతో దీపాలంకరణ చేయడం ఏమిటీ? అనుకుంటున్నారా. ఇది నిజమే.. మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు స్థాయీ సంఘ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌, సంఘం ఛైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో 103 అంశాలకు ఆమోదం తెలిపారు. అజెండాలో పొందుపరిచిన 100 అంశాలతోపాటు, టేబుల్‌ అజెండాగా చేర్చిన మరో ఐదు అంశాలను కార్యదర్శి పల్లి నల్లనయ్య సభ్యులకు అందజేశారు. వాటిల్లో మెకానికల్‌ విభాగానికి చెందిన రెండు ప్రతిపాదనలను వాయిదా వేశారు. జీవీఎంసీలో నిరుపయోగంగా ఉన్న 90 వాహనాలను ఎంఎస్‌టీఎస్‌ ద్వారా వేలం వేయాలని నిర్ణయించారు. 9వ వార్డులో శ్మశానవాటికకు ప్రహరీ, ఖాళీ స్థలం పరిరక్షణకు ప్రహరీ నిర్మించే అంశాలను ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు.

*  జీ-20 సన్నాహక సమావేశాల సందర్భంగా బీచ్‌రోడ్డు, వీఐపీలు సంచరించే ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలను కొంత వరకు తొలగించి రంగులు వేయాలని నిర్ణయించారు. తెన్నేటిపార్కు, సీతకొండ వద్ద ఉన్న కొండలకు రంగు రంగుల విద్యుత్తు దీపాలు అమర్చాలని ప్రతిపాదించారు. విద్యుత్తు స్తంభాలకు ఎల్‌ఈడీ, సీరియల్‌ సెట్లు అమర్చే పనులను గుత్తేదారుకు ఇవ్వకుండా పూర్తిగా కొనుగోలు చేయాలని నిర్ణయించడం గమనార్హం.

*  కొబ్బరిచెట్లకు విద్యుత్తు దీపాలు అమర్చడానికి రూ.48.80 లక్షలు వ్యయం చేయడంతోపాటు విద్యుత్తు లేని ప్రాంతంలో వినియోగించడానికి రూ.29.25లక్షలతో నాలుగు జనరేటర్లు కొనుగోలుకు సభ్యులు ఆమోదం తెలిపారు. విద్యుత్తు దీపాలతో చెట్లకు హాని కలిగే అవకాశం ఉందని స్థాయీ సభ్యురాలు అప్పారి శ్రీవిద్య అభ్యంతరం తెలిపారు. ఎల్‌ఈడీ దీపాల వల్ల వేడిమి, రేడియేషన్‌ ఉండదని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొన్నారు.జీవీఎంసీలో సుందరీకరణ పనులను ఇంజినీరింగ్‌ అధికారులు చేస్తుంటారు. దానికి విరుద్ధంగా పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

శ్మశానాల్లో అభివృద్ధి పనులపై చర్చ లేదు: నగరంలో జీ-20 సమావేశాలు, ఇన్ఫినిటీ వైజాగ్‌ 2023, వైజాగ్‌ టెక్‌ సమ్మిట్‌, పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని 8 జోన్లలో 38 శ్మశానాలను రూ.15.06 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు అజెండాలో అధికారులు వెల్లడించారు. ఒక్కో శ్మశానవాటికకు రూ.25 లక్షలనుంచి రూ.49.92 లక్షల వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదనలు పెట్టగా, వాటిపై సభ్యులు కనీసం చర్చించలేదు..అయినా ఆమోదం తెలిపారు.

చెత్త సేకరణకు అంత ఖర్చా..

భీమిలి జోన్‌లో రహదారి పక్కనున్న 16 బిన్నుల నుంచి చెత్తను తొలగించడానికి జీవీఎంసీకి చెందిన రెండు వాహనాలను నడపడంతోపాటు, నిర్వహణ పనులకు రూ.36.49 లక్షలు ప్రతిపాదించడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీవీ సురేష్‌, కోరుకొండ స్వాతిదాసు మాట్లాడుతూ కిలోమీటర్ల వారీగా ఎంత లెక్క కట్టారో తెలపకుండా, జీవీఎంసీ వాహనాన్ని వినియోగించే గుత్తేదారుకు ఒక్కో వాహనానికి నెలకు రూ.1.53లక్షలు ఇస్తారా అంటూ నిలదీశారు.

*    ఒక్కో వాహనం 16 కిలోమీటర్లు తిరుగుతుందని ఒకసారి, 60 కిమీ తిరుగుతుందని మరోసారి ఇంజినీరింగ్‌ అధికారులు సమాధానం ఇచ్చారు. ఎలా లెక్క కట్టినా నిర్వహణతో కలసి రూ.90వేల కంటే ఎక్కువ కాదని సభ్యులు తెలిపారు. మలేరియా విభాగంలో ఆరు వాహనాల నిర్వహణకు రూ.43.20లక్షలు వ్యయం చేయాలని ప్రతిపాదించగా, పూర్తి వివరాలు సమర్పించిన తరువాత వాటిని ఆమోదించాలని సభ్యులు కోరారు. దీంతో మేయర్‌ ఆయా అంశాలను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని