logo

ఆటలాడేద్దాం..

చదువుతోపాటు ఆటలు, వ్యాయామం ఉంటేనే విద్యార్థులు రాణించగలరు. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నేళ్లుగా సరైన క్రీడా సామగ్రి లేక క్రీడా శిక్షణ తూతూమంత్రంగానే సాగుతోంది.

Updated : 05 Feb 2023 02:58 IST

ప్రభుత్వ   పాఠశాలలకు క్రీడా సామగ్రి
మాడుగుల గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే

చదువుతోపాటు ఆటలు, వ్యాయామం ఉంటేనే విద్యార్థులు రాణించగలరు. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నేళ్లుగా సరైన క్రీడా సామగ్రి లేక క్రీడా శిక్షణ తూతూమంత్రంగానే సాగుతోంది. ఈ కొరత తీరేలా ప్రభుత్వం క్రీడా పరికరాలను మంజూరు చేయగా, ఉమ్మడి విశాఖలోని 4,032 పాఠశాలలకు ఇవి చేరనున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో ఆటలు ఆడించాలనేది దశాబ్దాల తరబడి వస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఓ గంటపాటు ఆటలు ఆడిస్తారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. రెండున్నరేళ్ల కిందట విద్యాశాఖ కొన్ని రకాల ఆట వస్తువులు ఇవ్వగా వాటితోనే ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. ఇందులో చాలా వరకు పాడైపోవడంతో పరుగుపందెం, కబడ్డీ, ఖోఖో తదితర ఆటలు తప్పితే వస్తువులతో ఆడే అవకాశం చాలామందికి లేకుండాపోయింది. పాఠశాలలకు తగినన్ని నిధులు లేకపోవడంతో చేసేదేమీ లేక ఉన్న వాటితోనే పీడీలు సరిపెట్టుకుని విద్యార్థులను ఆడిస్తున్నారు. వాస్తవంగా క్రీడా సామగ్రిని ఏడాది కిందటే కేటాయించాల్సి ఉంది. కరోనా కారణంగా సంబంధిత సంస్థ వీటిని కేటాయించడంలో జాప్యం చేసింది. ఎట్టకేలకు ఆట వస్తువులను పంపిస్తుండటంతో ఇటు విద్యార్థులు, అటు వ్యాయామ ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహం వచ్చింది.

క్రికెట్‌, షటిల్‌ బ్యాట్లు

అదనంగా కేటాయింపు

రెండున్నరేళ్ల కిందట 13 రకాల సామగ్రి ఇవ్వగా.. ఇప్పుడు 23 రకాల ఆట వస్తువులను ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలకు 4, ప్రాథమికోన్నత పాఠశాలకు 9 రకాల వస్తువులు ఇవ్వగా.. ఉన్నత పాఠశాలకు 23 ఇచ్చారు. వీటిలో క్యారమ్స్‌, రింగ్స్‌, లూడో, డిస్క్‌త్రో, జావెలిన్‌ త్రో, క్రికెట్‌ బ్యాట్లు, బాల్స్‌, టెన్నికాయిట్‌ రింగ్స్‌, ఖోఖో పోల్స్‌, వాలీబాల్‌, త్రోబాల్‌, నెట్లు, హ్యాండ్‌బాల్‌, షటిల్‌ బ్యాట్‌లు, కాక్‌లు, స్కిప్పింగ్‌ రోప్స్‌, రిలే బ్యాటర్స్‌, హ్యాడిల్స్‌ తదితర రకాలున్నాయి. ప్రస్తుతం జావెలిన్‌త్రో, రిలే బ్యాటర్స్‌, హ్యాండ్‌ బాల్‌, క్రికెట్‌ బాల్స్‌, క్యారమ్స్‌ బోర్డు, ఖోఖో పోల్స్‌ అదనంగా వచ్చాయి. ఇవన్నీ కేంద్రియ బాండార్‌ నుంచి కేటాయించారు. ఉన్నత పాఠశాలలకు సామగ్రి కేటాయింపు విషయంలో ఆయా ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. చాలాచోట్ల 500కు మించి విద్యార్థులున్నారు. తక్కువ, ఎక్కువ అని లేకుండా అందరికీ ఒకే రకంగా ఆట వస్తువులు ఇవ్వడంతో ఎక్కువ మంది ఉన్నచోట్ల ఆడించేందుకు సరిపోవని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆటవస్తువులు తీసుకెళుతున్న ఉపాధ్యాయులు


ఫిట్‌నెస్‌ పెంచేలా..

పాఠశాలల్లో ఆటలు ఆడించేందుకు ఇప్పుడు కేటాయించిన క్రీడా సామగ్రి బాగా ఉపయోగపడుతుంది. రెండేళ్ల కిందటి కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో వస్తువులు ఇచ్చారు. ప్రధానంగా ఫిట్‌నెస్‌ పెంచే పరికరాలను కేటాయించారు.

కుందూరు రాజు, వ్యాయామ ఉపాధ్యాయుల కన్వీనర్‌, నక్కపల్లి


ఆటల్లో తీర్చిదిద్దాలి

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆట వస్తువులను కేటాయిస్తుంది. ప్రస్తుతం ఇచ్చిన వాటిలో అన్ని తరగతుల వారికి ఉన్నాయి. చదువుతోపాటు సమాంతరంగా ఆటలు ఆడించాలి. క్రీడల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దాలి. ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తుండాలి.

 బి.లింగేశ్వరరెడ్డి, డీఈఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని