logo

దేవుడి కొండ దేవాదాయ శాఖది కాదా?

పాటిపల్లి అహోబిల వరాహ నరసింహదేవుని కొండ స్థలంపై అనకాపల్లికి చెందిన వ్యక్తుల కన్నుపడింది. పిచ్చిమొక్కలు తొలగించి, కొండరాళ్లను తొలగించి చదును చేశారు.

Published : 05 Feb 2023 02:47 IST

అధికారుల తీరుపై పాటిపల్లి వాసుల ఆగ్రహం

దేవాదాయభూమిలో ఆక్రమణలను పరిశీలిస్తున్న ఈఓ రమాబాయి

మునగపాక, న్యూస్‌టుడే: పాటిపల్లి అహోబిల వరాహ నరసింహదేవుని కొండ స్థలంపై అనకాపల్లికి చెందిన వ్యక్తుల కన్నుపడింది. పిచ్చిమొక్కలు తొలగించి, కొండరాళ్లను తొలగించి చదును చేశారు. సర్వేనంబరు 79, 112, 113లలో మూడు ఎకరాల స్థలాన్ని చదునుచేసి పంటభూమిగా మార్చేశారు. పామాయిల్‌, కొబ్బరిమొక్కలు నాటారు. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దర్జాగా దేవుని భూమి కాజేస్తున్నా ఇటు దేవాదాయ, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. మూడు ఎకరాల స్థలం విలువ రూ.మూడు కోట్లు ఉంటుంది. ఈ ఆక్రమణలపై ఇటీవల విశ్రాంత ఉపాధ్యాయుడు మొల్లేటి సత్యనారాయణ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. శనివారం దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి జి.వి.రమాబాయి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలం దేవాలయానికి సంబంధించినది అని ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని స్థానికులను ఆమె ప్రశ్నించారు. ఈఓపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని గుడి దేవాదాయ శాఖకు సంబంధించినదని మీదగ్గర సాక్ష్యాలున్నాయా? అన్ని ఎదురు ప్రశ్నించారు. దేవుని గుడి ఉన్న కొండ దేవాలయానికి సంబంధించింది కాకుండా ఆక్రమణలదారులది ఎలా అవుతుందని, మీ ప్రోద్బలంతోనే కోట్లు విలువజేసే భూమి ఆక్రమించుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఆక్రమణదారులపై చర్య తీసుకొని భూమిని స్వాధీనం చేసుకోకపోతే దేవాదాయ శాఖను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎట్టకేలకు ఈఓ రమాబాయి రికార్డులను పరిశీలించి ఆక్రమణకు గురైన భూమి దేవాదాయశాఖకు చెందినదేనని గుర్తించారు. సర్వేచేసి దేవుని భూమి అప్పగించాలని ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ వినయ్‌కుమార్‌కు ఈఓ  వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భీశెట్టి ధన శ్రీను, సరిసా శ్రీను, ఆడార చిరంజీవి, శరగడం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని