logo

రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి

నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న  భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

Updated : 05 Feb 2023 02:58 IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ
తొమ్మిది జిల్లాల అధికారులతో సమీక్ష

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఈనాడు, విశాఖపట్నం : నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న  భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. విశాఖలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి  పరిధిలోని తొమ్మిది జిల్లాల రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.30 వరకు సాగింది. అధికారులు, సిబ్బందిని మాత్రమే లోనికి అనుమతించారు. ఈ సమావేశంలో రీసర్వేకు సంబంధించిన అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని, వారి పనితీరుతోనే ప్రభుత్వానికి పేరొస్తుందని మంత్రి సూచించారు. ప్రజలతో హుందాగా వ్యవహరించి తెలియజేసిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. వివిధ సర్వే పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ తన అనుభవాలను కలెక్టర్లతో పంచుకున్నారు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ సాయిప్రసాద్‌, సర్వే శాఖ ఎండీ సిద్ధార్థజైన్‌ అధికారుల సందేహాలు నివృత్తి చేశారు.

చట్ట ప్రకారమే సర్వే: రీసర్వేకు సంబంధించి జిల్లాల వారీగా పరిస్థితిని తెలుసుకొని అధికారులకు సూచనలు చేశారు. మంత్రి నేరుగా కొందరు తహసీల్దార్లతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఎన్ని చోట్ల రీసర్వే జరిగింది, ఎక్కడెక్కడ జరుగుతోంది అందులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురైన సమస్యలపై సాంకేతిక బృందం ద్వారా సలహాలు ఇప్పించారు.

* నిబంధనలు, ఆర్‌వోఆర్‌ చట్టం ప్రకారం అధికారులు రీసర్వే నిర్వహించాలన్నారు.  ఆ పరిధులను ఎవరూ మీరొద్దని చెప్పారు.

* రీసర్వేపై  ప్రతి మండలానికి నియమించిన ఉప తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

* వాస్తవ స్థలానికి, దస్త్రాల్లో ఉన్న లెక్కలకు వ్యత్యాసం రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్య జాయింట్‌ పట్టాల పంపిణీ సక్రమంగా ఉండేలా చూడాలని,  పంపకపు దస్తావేజులను రిజిస్టర్‌ చేసి ఆ దస్తావేజులతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామసభల తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

* నగరాలు, పట్టణాల్లో ఉపతహసీల్దార్ల ఆధ్వర్యంలోనే సర్వే జరగాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఒక నంబరు ఇవ్వాలన్నారు. పురపాలక, సర్వేశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరుగుతుందన్నారు.  

వాటిపై తాత్సారం ఎందుకు?: 22ఏ జాబితాలో భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు తాత్సారం చేయడంపై మంత్రి గట్టిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా జిల్లాల కలెక్టర్లే వాటిని పరిష్కరించకపోతే ఎలా అని అడిగినట్లు సమాచారం.  22ఏ కింద వచ్చిన దరఖాస్తులలో ప్రాథమిక ఆధారాలు పరిశీలించి, వాస్తవమైతే పరిష్కరించండి. ఆ స్థాయిలో చేయలేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించండి అని తెలియజేసినట్లు తెలిసింది. 22ఏలో ఉన్న వాటికి 1బి, సబ్‌డివిజన్‌ వంటి ఇతర పత్రాల ఆధారాలుంటే ఇబ్బంది పెట్టకుండా ప్రజాహితంగా పనులు చేయాలని సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని