logo

సందడిగా పూడిమడక జాతర

పూడిమడక జాతర సందడిగా ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రమే భక్తుల రాక మొదలైంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అనకాపల్లి ఆర్టీసీ అధికారులు 40 ప్రత్యేక బస్సులను చోడవరం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ఏర్పాటు చేశారు.

Updated : 05 Feb 2023 04:21 IST

తీరంలో ఏర్పాటైన గుడారాలు, రంగులరాట్నాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడక జాతర సందడిగా ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రమే భక్తుల రాక మొదలైంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అనకాపల్లి ఆర్టీసీ అధికారులు 40 ప్రత్యేక బస్సులను చోడవరం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో హాజరయ్యే మహిళా భక్తులను దృష్టిలో ఉంచుకొని తీరంలో దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు. అచ్యుతాపురం, పూడిమడక, కడపాలెం సమీపంలో పోలీసు అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎవరూ తీరంలోపలకి వెళ్లకుండా పడవులను ఉంచారు. పుణ్యస్నానాలు ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమై సాయంత్రం వరకు జరగనున్నాయి. అదివారం అందరికీ సెలవు కావడంతో రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా మజ్జిగ, తాగునీరు అందివ్వడానికి శిబిరాలను ఏర్పాటు చేశారు. పూడిమడక పంచాయతీ కార్యాలయం వద్ద భక్తులకు సహకారం ఇవ్వడానికి శిబిరం ఏర్పాటు చేశారు. తీరం వద్ద దుకాణాలను ఏర్పాటు చేశారు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆరుగురు ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు, 20 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 36 మంది కానిస్టేబుళ్లను నియమించారు.

* జాతర సందర్భంగా జానపద ప్రదర్శనతోపాటు బాలల నృత్యాలు, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. రాత్రంతా జాగారం చేసిన భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సర్పంచి సుహాసిని, మాజీ సర్పంచి వెంకటరమణ, నాయకులు పారునాయుడు, వాసుపల్లి శ్రీను తెలిపారు. తెల్లవారుజాము నుంచి జరిగే పుణ్యస్నానాలు ప్రశాంతంగా ముగిసేలా వాలంటీర్లను సిద్ధంగా ఉంచామని అధికారులు చెప్పారు. గ్రామంలో వీధులన్నీ విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కిలోమీటర్‌పైన విద్యుత్తు పందిరి దీపాలంకరణతోపాటు రోడ్డుకు ఇరువైపులా నాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సముద్రంలో ఉంచిన పడవలపై భారీస్థాయిలో మందుగుండు ఉంచి వెలిగించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో తీరం సందడిగా మారింది.

భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు రేవుపోలవరం తీరానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టినట్లు సీఐ నారాయణరావు చెప్పారు. అడ్డురోడ్డు నుంచి రేవుపోలవరం వరకు బస్సులు నిలిపే స్థలం, ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్‌ తెలియజేసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. అడ్డురోడ్డు మార్గంలో శనివారం రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని