logo

గ్రామాలను గాలికొదిలేశారు

బాబా అణుపరిశోధన కేంద్రం (బార్క్‌) పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్వాసితులు కోరారు.

Published : 05 Feb 2023 02:47 IST

అధికారులకు బార్క్‌ నిర్వాసితుల ఫిర్యాదు

ఏపీఐఐజీ జడ్‌ఎంకు వినతిపత్రం అందజేస్తున్న బార్కు నిర్వాసితులు, నాయకులు  

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: బాబా అణుపరిశోధన కేంద్రం (బార్క్‌) పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్వాసితులు కోరారు. తంతడి పంచాయతీ పరిధిలో యాతపాలెం, అంగవానిపాలెం నిర్వాసితులు, తెదేపా, వైకాపా నాయకులు శనివారం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని వన్‌స్టాప్‌ కార్యాలయంలో శనివారం ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ త్రినాథరావును కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. బార్క్‌ నిర్మాణానికి భూములిచ్చి ఇప్పుడు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ ఉండే భూములను తీసుకొని గ్రామాలను మాత్రం శ్మశానాల్లా వదిలేశారన్నారు. తాగునీరు, రోడ్డు, రవాణా, వైద్యసేవలు పొందే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు వివరించారు. దొప్పెర్ల పరిధిలో పునరావాసం కల్పించడంతోపాటు జిరాయితీలో ఉండే ఇళ్లకు, చెట్లకు అందివాల్సిన పరిహారం, కొండబోరంబోకు స్థలాలు, అనాధీనం భూములకు పరిహారం అందివ్వాలని కోరారు. రావిపాలెం పరిధిలో స్థలం ఉందని, అక్కడ స్థలాన్ని లేఅవుట్‌గా అభివృద్ధి చేసి ఇంటిస్థలాలు కేటాయిస్తామని జడ్‌ఎం వారికి హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకుంటే బార్క్‌ నిర్మాణ పనులను అడ్డుకోవాల్సి వస్తుందని నిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకుడు రాజాన నానాజీ, వైకాపా నాయకులు రాజాన అప్పారావు, చోడిపల్లి దేముడు, చెల్లుబోయిన నాయుడు, కృష్ణ, కృష్ణారావు,  తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని