logo

నకిలీ ధ్రువపత్రాల కలకలం

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో దొంగ ధ్రువీకరణ పత్రాలు కలకలం రేపుతున్నాయి.

Published : 06 Feb 2023 04:45 IST

వీఎంఆర్‌డీఏలో పదోన్నతుల కోసం అడ్డదారి
ఉద్యోగులకు తాఖీదులు
ఈనాడు, విశాఖపట్నం

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో దొంగ ధ్రువీకరణ పత్రాలు కలకలం రేపుతున్నాయి. అధికారులు ఉద్యోగులపై చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. అటువంటివి గతంలో ఇంకెంతమంది సమర్పించి ఉంటారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వీఎంఆర్‌డీఏలోని ఓ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అవసరమైన పత్రాలతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. వీటిని నిశితంగా పరిశీలించిన ఉన్నతాధికారులు అవి తప్పుడువని గుర్తించినట్లు తెలిసింది. ఆ ఉద్యోగులు కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఓ సాంకేతిక విద్య కోర్సు చేసినట్లు పత్రాలు పరిపాలన విభాగానికి సమర్పించారు. అధికారులు వాటిని నిజనిర్ధరణ చేసుకునేందుకు ఆ విశ్వవిద్యాలయానికి లేఖ రాశారు. ఆ విశ్వవిద్యాలయం అధికారులు ఆ పత్రాలను పరిశీలించి ఆ కోర్సులను 2013-14 విద్యా సంవత్సరంలోనే ఆపేశామని అటువంటివి ఏమీ నిర్వహించడం లేదని సమాధానం పంపారు. దీంతో అధికారులు నివేదిక తయారు చేసి అవి తప్పుడు ధ్రువీకరణ పత్రాలుగా పేర్కొని ఉద్యోగులకు తాఖీదులు జారీ చేశారు. దాని మీద వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.  

* పదోన్నతుల కోసం దస్త్రం తయారు చేసిన పర్యవేక్షణ ఉద్యోగికి అధికారులు నోటీసు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అన్నీ సరిచూసుకొని దస్త్రం పెట్టాల్సి ఉండగా ఇష్టానుసారంగా పెట్టడం, తప్పుడు పత్రాలని తెలిసే పెట్టారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగిపై ముందు నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల దస్త్రాలకు సంబంధించి వ్యక్తులు నచ్చితే వెంటనే, నచ్చకపోతే ఆలస్యం చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. తప్పుడు పత్రాలకు సంబంధించి దస్త్రాన్ని సిద్ధం చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు చేయనట్లు సమాచారం.  

* వీఎంఆర్‌డీఏలోని పలు విభాగాల్లో కొందరు ఇదే రీతిలో పదోన్నతులు పొందారన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతి కోసం తప్పుడు పత్రాలు సమర్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు ఇదే తరహాలో పొందినట్లు సమాచారం. తప్పుడు పత్రాల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో గతంలో పదోన్నతులు పొందిన వారి పత్రాలనూ అధికారులు తనిఖీ చేస్తారేమో చూడాలి.

గాజువాక కేంద్రంగా..

ఉద్యోగులు గాజువాకలోని ఓ స్టడీ సెంటర్‌లో కోర్సు చేసి ఈ ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు సమాచారం. నగరంలో కొందరు స్టడీ సెంటర్ల పేర్లతో నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ ఘటనలు గతంలో వెలుగు చూశాయి. వాస్తవానికి ఆ స్టడీ సెంటర్‌కు గుర్తింపు ఉందా? ఆ కేంద్రం జారీ చేసే ధ్రువీకరణ పత్రాలకు విలువ ఉందా.. అనేది తెలియాలి. అందుకే అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తే పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడే అవకాశం ఉంది. గుర్తింపు లేకపోతే ఇదో పెద్ద కుంభ కోణంగా మారే ప్రమాదం లేకపోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు