logo

మహిళా ప్రజాప్రతినిధులు ఆటంకాల్ని అధిగమించాలి!

‘మహిళా ప్రజాప్రతినిధులు రోజువారి విధుల్లో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనేలా సామర్థ్యాలు పెంపొందించుకోవాలి.

Published : 06 Feb 2023 04:45 IST

కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే : ‘మహిళా ప్రజాప్రతినిధులు రోజువారి విధుల్లో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనేలా సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. రోజువారి జీవితంలో కొన్ని సార్లు వారి సహజ ఎదుగుదలకు స్త్రీ అనే లింగ భేదం ఆటంకంగా కనిపిస్తుంది. ఆ సమయంలో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాల’ని జెండర్‌ అండ్‌ ఛైల్డ్‌ సెంటర్‌ కార్యనిర్వాహక సంచాలకులు దిశా పన్ను, సెంటర్‌ ముఖ్య ప్రోగ్రాం అధికారి అంజలీ చౌహాన్‌ అన్నారు. ఈ సందర్భం లింగ సమానత్వంపై అవగాహన కల్పించారు. నేషనల్‌ జెండర్‌ అండ్‌ ఛైల్డ్‌ సెంటర్‌, లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సహకారంతో జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో జెండర్‌ రెస్పాన్సివ్‌ గవర్నెర్స్‌పై నిర్వహించిన కార్యశాల కొనసాగుతోంది. రెండో రోజు ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా నాయకుల్లో నైపుణ్య సామర్థ్యాల పెంపు, వారిలో స్వీయ అవగాహన స్థాయిలు పెంచడం, సవాళ్లను ఎలా ఎదుర్కొనాలనే అంశాలపై చైతన్యవంతుల్ని చేశారు. డిజిటల్‌ అక్షరాస్యత, సామాజిక మాధ్యమాలపై ముంబయికి చెందిన అహాన్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సోనాలి పాటంకర్‌ నేతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సైబర్‌ హింసలు, మహిళలపై జరుగుతున్న దాడులు గురించి వివిరించారు. వివిధ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని జేఎన్‌యూ, దిల్లీ ఉపకులపతి శాంతి శ్రీ ధూళిపూడి అన్నారు. వారి ప్రాతినిథ్యం పెరగాలన్నారు. ‘షీ ఈజ్‌ ఏ ఛేంజ్‌ మేకర్‌’ ప్రాజెక్టు కింద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని