logo

జీతాలు మహాప్రభో!

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందగా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Published : 06 Feb 2023 04:45 IST

ఆంధ్ర వర్సిటీ ఉద్యోగులు, పింఛనర్ల ఇక్కట్లు
రెండు నెలలుగా ఇదే పరిస్థితి
ఈనాడు, విశాఖపట్నం

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందగా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మునుపెన్నడూ ఈ విధంగా జరగకపోవడంతో ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడతాయా అని ఏ రోజుకు ఆ రోజు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీకి బడ్జెట్‌ రాకపోవడంతో ఈ రకమైన దుస్థితి నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఏటా వేతనాలు, ఇతర అవసరాల కోసం రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్ల బడ్జెట్‌ అవసరమని విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వర్సిటీకి రూ.400 కోట్ల వరకు కేటాయిస్తుంది. ఆ నిధులతో ఎప్పుడూ సరిపెట్టుకొచ్చేవారు. ఈసారి పలు కారణాల వల్ల పూర్తిస్థాయి బడ్జెట్‌ రానట్లు సమాచారం. దీంతో అదనంగా అవసరమయ్యే నిధుల కోసం వర్సిటీ నుంచి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. సుమారు రూ.150 కోట్ల వరకు అవసరమని పంపించినట్లు తెలిసింది. దీన్ని ఆమోదించి ప్రభుత్వం గ్రాంట్‌ విడుదల చేసింది. చివరి నిమిషంలో ఫైనాన్స్‌ విభాగం వద్ద పలు సమస్యల వల్ల నిలిచిపోయినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఎప్పటికి పరిష్కారమవుతుందో, ఉద్యోగుల ఖాతాల్లోకి ఎప్పుడు నిధులు జమవుతాయో తెలియడం లేదు.

వేల మందికి..

ఏయూ రెగ్యులర్‌ ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు నెలలుగా జీతాలు లేవు. బోధనేతర సిబ్బందికి ఒక నెల జీతం అందాలి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లు గడిచేందుకు కొందరు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జీతం ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోధన సిబ్బందికి వరుసగా రెండు నెలల పాటు అందకపోవడంతో నెలసరి వాయిదాలు, ఈఎంఐల చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు వైద్యపరమైన ఖర్చుల కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. వృద్ధాప్యంలో ఉండి పింఛను మీదే ఆధారపడే వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీలో పింఛనుదారులే అధికంగా ఉండడంతో ఎదురుచూస్తున్నారు.

బకాయిలు ఎప్పుడో?

బోధన సిబ్బంది వేతన సవరణను పింఛను ఉద్యోగులకు అమలు చేయాలి. 1.1.2016 నుంచి 31.3.2019 మధ్య పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పింఛను సవరణ జరగకపోవడంతో బకాయిలు ఉండిపోయాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటీవల విశాఖకు వచ్చిన ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిని విశ్రాంత బోధన సంక్షేమ సంఘ సభ్యులు కలిసి బకాయిలు విడుదల చేయాలని అభ్యర్థించారు.

ప్రస్తుతం బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది 2500 మంది వరకు ఉన్నారు. పింఛను దారులు మాత్రం ఏడు వేల మంది వరకు ఉంటారనేది అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు