logo

నైపుణ్య శిక్షణ ఉద్యోగ కల్పన

నైపుణ్యాల్లేకపోతే ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అలాంటిది డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో అత్యధికం పేద యువతే.

Updated : 07 Feb 2023 05:53 IST

డిగ్రీ విద్యార్థులకు అండగా జేకేసీ

శిక్షణలో విద్యార్థులు

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: నైపుణ్యాల్లేకపోతే ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అలాంటిది డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో అత్యధికం పేద యువతే. కోర్సు పూర్తయిన తర్వాత మార్కెట్‌లో వారికి ఉద్యోగావకాశాలు కనిపించడం లేదు. దీంతో వారిలో ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో జవహర్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు(జేకేసీ) ఏర్పాటు చేసింది. ఒక పక్క డిగ్రీ కోర్సులు చదువుతూనే ఆయా కేంద్రాల్లో చేరి విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ సిల్స్‌, అర్ధమెటిక్‌ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందవచ్చు. ముఖ్యంగా బీఏ, బీకాం, బీఎస్‌సీ చేసిన విద్యార్థులకు ఇది ఒక వరంలా నిలుస్తోంది. ఇదే తరహాలో విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జేకేసీలో ఏటా విద్యార్థులు శిక్షణ పొందుతూ ఉద్యోగాకాశాలు పొందుతున్నారు.

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు


రెండేళ్ల కిందట నుంచి శిక్షణ

విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2007 విద్యా సంవత్సరం నుంచి జేకేసీ ప్రారంభమైంది. 2019-20 సంవత్సరంలో కరోనా వల్ల ఇక్కడ ఎటుంటి శిక్షణ ఇవ్వలేదు. 2020-21 విద్యా సంవత్సరంలో ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 50 మంది, 2021-22లో 60 మంది విద్యార్థులకు ఉద్యోగాకాశాలు లభించాయని కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌ శోభారాణి తెలిపారు.


భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం

డిగ్రీలో సబ్జెక్టులు నేర్చుకుంటాం. ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే అదొక్కటే సరిపోదు. నేర్చుకున్న అంశాలను సరిగా వ్యక్తీకరించడం కూడా చాలా ముఖ్యం. జేకేసీలో దానిపైనే శిక్షణ ఇచ్చారు. ఇది మాలాంటి విద్యార్థినులకు చాలా ఉపయుక్తమవుతోంది. ఇంటర్వ్యూల్లో అభ్యర్థిలోని ఆత్మవిశ్వాసం, మాట్లాడే విధానం, బాడీలాంగ్వేజ్‌ తదితర అంశాలను చూస్తున్నారు. ఆయా అంశాల్లో ఇక్కడ శిక్షణ పొందడం వల్ల క్యాంపస్‌ డ్రైవ్‌లో విజయం సాధించడానికి వీలవుతోంది.

ప్రియాంక, బీస్సీ కంప్యూటర్‌ సైన్స్‌


విప్రోలో ఉద్యోగానికి ఎంపికయ్యా..

విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశా. అదే సమయంలో జేకేసీలో శిక్షణ పొందా. శిక్షణలో భాగంగా ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణ, కంప్యూటర్‌ నైపుణ్యాలను పెంచుకున్నా. అనంతరం జీకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో పాల్గొన్నా. విప్రో ప్రతినిధులు అడిగి ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చి ఉద్యోగానికి ఎంపికయ్యా.

రొంగలి సాహితీ, బీఏ


విద్యార్థులకు మంచి అవకాశం

డిగ్రీ కోర్సు ముగిసే నాటికి విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడేలా తర్ఫీదు ఇస్తున్నాం. ఆంగ్లంలో మాట్లాడం, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కొవాలి వంటి అంశాలను నేర్పిస్తున్నారు. కంప్యూటర్‌ నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నాం. దీంతో విద్యార్థులు ఐటీ, బీపీఓ వంటి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జేకేసీ కేంద్రాలు డిగ్రీ విద్యార్థులకు ఒక వరం లాంటివని చెప్పవచ్చు.

డి.అరుణ, జేకేసీ కో-ఆర్టినేటర్‌, ప్రభుత్వ డిగ్రీ కకళాశాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు