logo

ఏకగ్రీవ నిధులకు ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 09 Feb 2023 06:11 IST

4.65 కోట్లిచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు

ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్పందించి జిల్లాలో 75 పంచాయతీలు ముందుకొచ్చాయి. వీటికి జనాభా లెక్కన రూ.5 లక్షల, రూ.10 లక్షలు చొప్పున రూ.4.65 కోట్ల నజరానా ఇవ్వాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువు తీరి రెండేళ్లు కావొస్తున్నా సర్కారు ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులను మాత్రం విడుదల చేయలేదు.

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, కోటవురట్ల: ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు అదనంగా ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహక మొత్తం అందుబాటులోకి వస్తే మిగతా గ్రామాల కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచులు ఆశపడ్డారు. ఏడాది క్రితం ఓసారి ఏకగ్రీవ నిధులు మంజూరు చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు పరిస్థితి అంతే..సాధారణ నిధులున్నా ఖర్చుపెట్టడానికి ఆంక్షలు పెడుతుండడంతో ఏకగ్రీవ పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

నదిలో దిగి పొలానికికి వెళ్తున్న నారాయణరాజుపేట గ్రామస్థులు

నాడు అలా..  నేడు ఇలా..

మాకవరపాలెం మండలంలో నారాయణరాజుపేట పంచాయతీని తెదేపా హయాంలో ఏకగ్రీవం చేసుకున్నారు. నాటి ప్రభుత్వం ప్రోత్సహక నిధులుగా రూ.7 లక్షలు ఇచ్చింది. అపుడు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు గ్రామాభివృద్ధి కోసం మరికొన్ని పథకాల నుంచి సుమారు రూ.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామంలో చాలావరకు అభివృద్ధి పనులు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే సర్పానదిపై వంతెన నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారి వైకాపా సర్కారు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని పీలా వరలక్ష్మిని ఏకగ్రీవంగా గెలిపిస్తే సర్పా నదిపై వంతెన తామే నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ హామీ ఇచ్చారు. దీంతో వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరిగిన రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు రాలేదు.. వంతెన మాట మరుగున పడిపోయిందని గ్రామస్థులు అంటున్నారు.

మిగతా పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. నిధులు వస్తే గ్రామాల్లో ఏదోక అభివృద్ధి పనులు చేద్దామని నిరీక్షిస్తున్నారు.. ఈ విషయమై డీపీవో శిరీషారాణి వద్ద ప్రస్తావించగా ఏకగ్రీవ నిధులు ఇంకా రాలేదని, త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంతకుముందు మంజూరై వెనక్కి వెళ్లినట్లు సమాచారం లేదన్నారు.

నిధుల్లేక ఇబ్బందులు..

ప్రోత్సాహక సొమ్ము వస్తుందని చూస్తున్నాం. ఇంతవరకు పైసా వేయలేదు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని నివారణకు ప్రధాన మురుగు కాలువపై పలకలు వేయాలి. దీంతో పాటు వీధి రోడ్లు నిర్మాణం, కుళాయిలు వేయించాలి. గ్రామం చిన్నది కావడంతో నిధులరాక అంతంతమాత్రంగా ఉంది. అధికారులను అడుగుతుంటే అందరితోపాటే వస్తాయి అంటున్నారు తప్పితే, ఎప్పుడనేది చెప్పడంలేదు.

ఫాతిమున్నీసా బేగం, సర్పంచి పెదబోదిగల్లం

శ్మశానం, రోడ్లు బాగుచేయాలి

ప్రజలంతా కలిసి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక సొమ్ముకోసం ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్నాం. వీటితో గ్రామంలో 500 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం, శ్మశానంలో నీటి సదుపాయం కల్పించి షెడ్లు కట్టాలని చూస్తున్నాం. నిధుల్వికపోవడంతో ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు.

గోసల నర్సమ్మ, సర్పంచి, బంగారమ్మపేట


పైసా కూడా రాలేదు..

ఏకగ్రీవం సొమ్ముల కోసం రెండేళ్ల నుంచి చూస్తున్నాం. ఆ నిధులు వస్తే గ్రామంలో మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టాలని అనుకున్నాం. ఇప్పటి వరకు పైసా నిధులు రాలేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా అందుబాటులో లేవు. మాతో పాటు పాములవాక, రామన్నపాలెం, బోడపాలెం పంచాయతీలు కూడా మా మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైనవే. ఏ పంచాయతీకి ఈ నిధులు రాలేదు. వాటి కోసమే ఎదురుచూస్తున్నాం.

కన్నôరెడ్డి వరహాలుబాబు, సర్పంచి నీలిగుంట, కోటవురట్ల మండలం


పెదబోదిగల్లంలో పలకలు వేయాల్సిన మురుగు కాలువ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని