logo

ప్రభుత్వ స్థలంలో వైకాపా కార్యకర్తల పాగా

ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యకర్తలు ఆక్రమించి దుకాణాల నిర్మాణం ప్రారంభించారు.

Published : 09 Feb 2023 04:27 IST

భారీ వృక్షాన్ని నరికేసి వాణిజ్య సముదాయ నిర్మాణ యత్నం

పెదపల్లిలోని ప్రభుత్వ స్థలంలో పునాది తవ్వకం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యకర్తలు ఆక్రమించి దుకాణాల నిర్మాణం ప్రారంభించారు. ఈ స్థలంలో 50 ఏళ్లు పైగా ఉన్న మహా వృక్షాన్ని రాత్రికి రాత్రే నరికి తగుల బెట్టేశారు. తెదేపా నాయకుల ఫిర్యాదుతో ఈ ఆక్రమణల వ్యవహారం బయటపడింది.

పెదపల్లి ప్రధాన కూడలి వద్ద ప్రభుత్వ భూమిలో పెద్ద చెట్టు ఉంది. వైకాపా కార్యకర్తలు రాత్రికిరాత్రి చెట్టు నరికేశారు. దీన్ని తగలబెట్టి అక్కడే నిర్మాణ పనులు ప్రారంభించారు. తాగునీటి కుళాయిలు, బోరు, ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బంది కలిగేలా మధ్యలో నిర్మాణాలు ప్రారంభించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కి తెదేపా నాయకులు బొద్దపు నాగేశ్వరావు, దంట్ల వెంకటస్వామి, బొద్దపు శ్రీనివాసరావు కరణం వెంకట్రావు ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు అందించారు. దీంతో మున్సిపల్‌ టీపీవో శ్రీలక్ష్మి, సర్వేయర్లు గ్రామానికి చేరుకుని సర్వే చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గుర్తించి వెంటనే నిలిపివేయమని ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న భారీ వృక్షానికి నరికేసి కాల్చివేయడం నేరమని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టును ఎవరు నరికి కాల్చారన్న దానిపై విచారణ చేపడుతున్నారు.  

అడ్డుకోమన్న ఎమ్మెల్యే

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎలా నమోదై ఉందో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పరిశీలించారు.  అధికార పార్టీ నాయకుల మద్దతుతో అయిదుగురు కార్యకర్తలు ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులకు తెదేపా నాయకులు వివరించారు. అధికారులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రమణమూర్తిరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు నిలిపివేయించాలని ఆయన అధికారులకు సూచించారు. చెట్టు నరికిన వారిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని కరణం వెంకట్రావు తదితరులు హెచ్చరించారు. ఇక్కడ దుకాణాలు నిర్మిస్తే కుళాయిలకు, ఇళ్లకు వెళ్లడానికి దారి ఉండదని జనసేన నాయకులు బొద్దపు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నరికివేసిన భారీ వృక్షం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు