logo

‘ప్రచార పర్వం’లో..కిరికిరి

మీరు విశాఖలోని కొన్ని రోడ్లపై వెళ్తుంటే... భారీ ప్రచార స్తంభాలపై ఉన్న తెరలపై ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ రోడ్ల పక్కన...ఉద్యానవనాల్లో వాటిని తిలకించిన మీరు..ఇకపై నడి రోడ్డుపైనే చూడొచ్చు.

Published : 09 Feb 2023 04:27 IST

అనుకున్న వారికే ‘ఎల్‌ఈడీ హోర్డింగ్స్‌’ లీజు
వేగంగా కదులుతున్న దస్త్రాలు

ఈనాడు, విశాఖపట్నం: మీరు విశాఖలోని కొన్ని రోడ్లపై వెళ్తుంటే... భారీ ప్రచార స్తంభాలపై ఉన్న తెరలపై ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ రోడ్ల పక్కన...

ఉద్యానవనాల్లో వాటిని తిలకించిన మీరు..ఇకపై నడి రోడ్డుపైనే చూడొచ్చు. వాటిని చూస్తూ వెళితే... ప్రమాదాలు జరగొచ్చు కదా.. అని మీకు అనుమానమొచ్చిందా? ఎవరికైనా ఇలాగే వస్తుంది.

కానీ, జీవీఎంసీలోని కొందరు అధికారులకు ఇవేమీ అక్కర్లేదు. తమకు కావాల్సిన వారికి ఈ కాంట్రాక్ట్‌ అప్పగించేయాలంతే... అన్నట్లు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మరో విచిత్రమేమంటే... ఆవ్యవహారాలన్నీ టెండరు విధానంలో కాకుండా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేందుకు ప్రయత్నిస్తుండటం.

ఇలాంటి హోర్డింగులపైనే సరికొత్తగా ప్రకటనలు ప్రదర్శిస్తారు.

నగరంలో పలు చోట్ల వాణిజ్య ప్రకటనలు, ఆహ్వానాలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే భారీ హోర్డింగులను చూస్తుంటాం. నగర పరిధిలోని రోడ్లు, కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో అలాంటివి ఏర్పాటుకు జీవీఎంసీ కొన్ని ఏజెన్సీలకు లీజు ప్రాతిపదికన అనుమతి ఇస్తుంది. ఇందుకు టెండర్లను ఆహ్వానిస్తారు. ఇప్పటి వరకు ఈ విధానమే కొనసాగుతోంది. కొత్తగా ఎల్‌ఈడీతో కూడిన భారీ హోర్డింగులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. వీటి మీద (మూవింగ్‌ యాడ్స్‌) కదిలే ప్రకటనలను ప్రసారం చేస్తారు. నగరంలోని అనేక చోట్ల వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకు కీలకమైన    150 ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లు   సమాచారం. రోడ్ల మధ్యలో ఇలాంటి   ఏర్పాటు రాష్ట్రంలో ఇక్కడే     మొదటిసారని సమాచారం.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

నగర పరిధిలోని ఎల్‌ఈడీ హోర్డింగుల బాధ్యత అప్పగింతకు టెండర్లు పిలవాలి. అలా కాకుండా ఓ ప్రముఖ ఏజెన్సీకి చెందిన రెండు సంస్థలకే నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలని చూస్తున్నారు. వీటికి పోటీ ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. టెండరు ద్వారా పిలిస్తే జీవీఎంసీకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అలా చేయకుండా నచ్చిన ధరకు అప్పగిస్తే భారీ మొత్తంలో రెవెన్యూకు గండి పడే అవకాశాలున్నాయి.

* ఇదంతా ఓ కీలక అధికారి కనుసన్నల్లోనే జరుగు తుండటం గమనార్హం.  సదరు ఏజెన్సీకు లబ్ధి చేకూర్చే క్రమంలో అందుకు అనుగుణంగా దస్త్రాన్ని సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటువంటి అంశాల్లో లీజు, ధర నిర్ణయించే అధికారం నేరుగా ఆ కీలక అధికారికి లేదు. స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌లో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం గుర్తించిన కొందరు నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ అధికారి దీన్ని ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నిబంధనలకు విరుద్ధమైనా..

ఎల్‌ఈడీ హోర్డింగులను రోడ్డు మధ్య, కూడళ్ల వద్ద ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇందులో నిమిషానికి ఒకసారి ప్రసారాలు మారుతుంటాయి. ఇవి వాహనదారుల చూపును మళ్లిస్తాయి.  రహదారుల భద్రత చట్టం ప్రకారం ఏర్పాటు చేయకూడదని పలువురు పేర్కొంటున్నారు. అయినప్పటికీ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, ప్రాంతాల్లో ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు. దాదాపు 20 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఈ హోర్డింగులు ఉంటాయి. భారీ స్తంభాల మీద అందరికీ  కనిపించేలా ఏర్పాటు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని