logo

అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

భారతీయ క్రీడగా ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన టార్గెట్‌ బాల్‌లో మనదేశ యువత  అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ ఆకాంక్షించారు.

Published : 09 Feb 2023 04:27 IST

టార్గెట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: భారతీయ క్రీడగా ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన టార్గెట్‌ బాల్‌లో మనదేశ యువత  అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ ఆకాంక్షించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్‌ వర్సిటీ వేదికగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల పురుషుల విభాగం టార్గెట్‌ బాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. జట్టుగా విజయం కోసం కృషి చేయడం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా యువత జీవితంలో అవరోధాల్ని సైతం అధిగమించొచ్చన్నారు. టార్గెట్‌ బాల్‌ వంటి నూతన క్రీడల ద్వారా త్వరితంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించగలదన్నారు.

* భారతీయ టార్గెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోనూ శర్మ మాట్లాడుతూ హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడల్ని కలిపి భారతీయ క్రీడగా 2012 సంవత్సరంలో టార్గెట్‌ బాల్‌ను మధుర (ఉత్తరప్రదేశ్‌)లో ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 2017 నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో ఈ క్రీడను ప్రోత్సహిస్తోందన్నారు.

* గీతం క్రీడా విభాగం కార్యదర్శి అరుణ్‌కార్తిక్‌ మాట్లాడుతూ గీతంలో జరుగుతున్న ఈ పోటీలకు దేశంలోని 29 విశ్వవిద్యాలయాల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఏపీ నుంచి గీతం, ఏయూ, నాగార్జున, కేఎల్‌యూ వర్సిటీలతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ జట్లు పాల్గొన్నాయన్నారు.

* గీతం ప్రొ-వీసీ ఆచార్య వై.గౌతమ్‌రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య డి.గుణశేఖరన్‌, క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కూడా మాట్లాడారు. అనంతరం క్రీడా పతాకాలను ఎగురవేసి క్రీడా ప్రతిజ్ఞ చేశారు.

మొదటి రోజు ఫలితాలు: తొలిరోజు జరిగిన నాకౌట్‌ పోటీల్లో జననాయక్‌ చంద్రశేఖర్‌ యూనివర్సిటీ (లక్నో) జట్టుపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు విజయం సాధించగా... ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ జట్టు (విశాఖ)పై జీఎల్‌ఏ వర్సిటీ (యూపీ) జట్టు విజయాన్ని దక్కించుకుంది. మరో పోటీలో బీఎస్‌ అబ్దుల్‌ రెహమాన్‌ క్రీసెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(చెన్నై) జట్టుపై జననాయక్‌ చంద్రశేఖర్‌ యూనివర్సిటీ జట్టు గెలుపొందగా గుజరాత్‌ విద్యాపీఠ్‌ జట్టుపై జీఎల్‌ఏ వర్సిటీ జట్టు విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని