logo

సంచుల నిండా... వెండి బిస్కెట్లు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ముగింపు దశలో వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనం రేపాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్‌లో భారీగా వెండి బిస్కెట్లు (ఒక్కొక్కటి 15 గ్రాములు) సంచుల్లో నింపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.

Updated : 11 Mar 2023 03:51 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట కలకలం
అవి వైకాపా అభ్యర్థివేనని.. తెదేపా, పీడీఎఫ్‌ నేతల ఆందోళన

వెండి బిస్కెట్లు ఉన్న సంచులు

ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ముగింపు దశలో వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనం రేపాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్‌లో భారీగా వెండి బిస్కెట్లు (ఒక్కొక్కటి 15 గ్రాములు) సంచుల్లో నింపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో పీడీఎఫ్‌, తెదేపా నేతలు అప్రమత్తమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు సైతం చర్చనీయాంశమయ్యాయి. అధికారులు తక్షణం స్పందించలేదని, పోలీసులు బందోబస్తుగా ఉన్న సమయంలోనే వాహనాల్లో వెండి బిస్కెట్లు బయటకు తరలించేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా, పీడీఎఫ్‌ నేతలు నినాదాలు చేశారు.

బందోబస్తుకు వచ్చిన పోలీసులు

ఎంత జాప్యమో:  ఎన్నికల సమయంలో ఏమైనా పట్టుబడితే వెంటనే పోలీసులు, తనిఖీ సిబ్బంది వాటిని గుర్తించి ఎంత స్వాధీనం చేసుకున్నారో వెల్లడిస్తారు. ఇక్కడ మాత్రం దాదాపు ఐదు గంటల వరకూ అలా చేయకపోవడం గమనార్హం. తనిఖీకి వచ్చిన ఎమ్మార్వో, పోలీసులు కనీసం లోనికి వెళ్లలేదు. అదే సమయంలో కొందరిని మాత్రం లోపలికి పంపించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న వెండి బిస్కెట్లను వాహనాల్లో అక్కడి నుంచి తరలించటానికి వీలు కల్పించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఒక్కో బిస్కెట్‌పై 15 గ్రాములు అని రాసుంది. వివిధ ఆకృతులు కూడా ఉన్నాయి. పలు సంచులలో ఇవి ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్‌ ఉల్లంఘించి ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోలేదు’ అని సీపీఎం నేతలు ఆరోపించారు. గతంలో ప్రచారంలో పాల్గొన్న ఏయూ వీసీపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, ఇప్పుడు వెండి బిస్కెట్ల పంపిణీకి సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాచారం తెలిసి కలెక్టర్‌కు  ఫోన్‌లో ఫిర్యాదు చేయగా,  లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పేర్కొన్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని అందించేందుకు నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌కు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో, మూడో పట్టణ పోలీసుల సమక్షంలో పరిశీలించిన తనిఖీ బృందం..సదరు కార్యాలయంలో ప్రచార సామగ్రి మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.  

కొందరికే అనుమతి: దిశా ఏసీపీ వివేకానంద, 3వ పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ కోరాడ రామారావు, మరో ముగ్గురు ఎస్‌.ఐ.లు అపార్టుమెంట్‌ గేటు వద్దే ఉండి లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో  కొందరు వైకాపా నాయకులు, కార్పొరేటర్లను మాత్రమే లోపలికి పంపించడం గమనార్హం. తరువాత కొద్దిసేపటికి లోపల ఉన్న కొందరు బయటకు వెళ్లిపోవడంపై పలువురు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శిస్తున్నారు. అపార్టుమెంట్‌ ఎదురుగా కూడా ఎవరూ ఉండొద్దని పీడీఎఫ్‌, తెదేపా నేతలను పంపించేయడం గమనార్హం.

వెండి బిస్కెట్ల వీడియోలను చూపుతున్న  కార్పొరేటర్‌ గంగారాం

ఓటర్లను ప్రలోభపెట్టే యత్నం: ‘వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ ఓటర్లకు వెండి బిస్కెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఆర్కేబీచ్‌ దరి మెజిస్టిక్‌ టవర్‌లోని ఆయన కార్యాలయమైన ప్లాట్‌ నెంబరు 101 ఫ్లాట్‌లో వాటిని ఉంచారు. దీనిపై పీడీఎఫ్‌ బృందం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి, ఎన్నికల పరిశీలకులకు, పోలీసు కమిషనర్‌కు సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు చేసింది.  మహారాణిపేట తహసిల్దార్‌ రాత్రి 7.30 గంటలకు పోలీసులతో సహా వచ్చి కనీసం ఫ్లాట్‌లోకి వెళ్లకుండా అపార్టుమెంట్‌ గేటు  ముందే ఉండిపోయారు’ అని కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని