logo

Polavaram: పోలవరం కంకరకు కాళ్లు!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడికాలువకు ఇరువైపులా కంకర, మట్టి తవ్వి తరలించుకుపోవడంపై హైకోర్టు ఇటీవల సీరియస్‌ అయింది. సంబంధిత శాఖ అధికారులందరికీ నోటీసులు జారీచేసింది.

Updated : 16 Mar 2023 09:37 IST

కాలువ పొడవునా అక్రమ తవ్వకాలే
అధికార పార్టీ నేతలే సూత్రధారులు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, ఎలమంచిలి/గ్రామీణం, ఎస్‌.రాయవరం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడికాలువకు ఇరువైపులా కంకర, మట్టి తవ్వి తరలించుకుపోవడంపై హైకోర్టు ఇటీవల సీరియస్‌ అయింది. సంబంధిత శాఖ అధికారులందరికీ నోటీసులు జారీచేసింది. అక్రమ మైనింగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కుడి కాలువే కాదు.. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎడమ కాలువ పరిస్థితి అలానే ఉంది. పాయకరావుపేట నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఉన్న పోలవరం ఎడమ కాలువకు ఇరువైపులా అక్రమంగా రాళ్లు, కంకర, మట్టి తరలించుకుపోతున్నారు.

కప్పుడు కొండలను తలపించేలా ఉన్న కంకర గుట్టలన్నీ కరిగిపోతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతలకు ఈ కాలువ గట్లు కాసులు కురిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారుల కళ్లెదుటే కంకర కరిగిపోతున్నా.. రాళ్లు తరిగిపోతున్నా అధికార పార్టీ నాయకులతో మనకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు.

పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, రోడ్డు పక్కన స్థలాలు ఎత్తు చేయడానికి పోలవరం కాలువ గట్టు నుంచే ఎక్కువగా కంకర తరలిస్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు ఇదే వ్యాపారంగా మార్చుకున్నారు. రాత్రయితే చాలు ట్రాక్టర్లతో కంకరను అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. అడ్డురోడ్డు నుంచి తాళ్లపాలెం వరకు ఇటీవల రోడ్డు పక్కన చాలా నిర్మాణాలు జరిగాయి. రోడ్డుకు సమాంతరంగా కంకరతో నింపి ఎత్తుచేయడానికి వీరు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనికోసం నాలుగైదు లక్షలకు బేరం పెట్టుకుని చదును చేస్తున్నారు. పురుషోత్తపురం, మర్రిబంద, కొక్కిరాపల్లి, నర్సింగబిల్లి సమీపాల్లో ఇలా కంకరతో రోడ్డు పక్కనే స్థలాల ఎత్తు చేస్తున్నా ఇటు మైనింగ్‌, అటు పోలవరం అధికారులు పట్టించుకోలేదు.


ఆరు నెలల్లో పట్టుకుంది నాలుగు ట్రాక్టర్లే

నిబంధనల ప్రకారం పోలవరం కాలువ పక్కనున్న కంకర తీసుకోవాలంటే గనుల శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. క్యూబిక్‌ మీటర్‌ను బట్టి సీనరేజి చెల్లించాలి. ఏ ప్రాంతంలో తీసుకుంటారు.. ఎన్ని క్యూబిక్‌ మీటర్లు అన్నది మైనింగ్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణలో తరలించాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండానే కంకర పట్టుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చి రెండు ట్రాక్టర్లు పట్టుకోవడం తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది. రోజూ వందలాది ట్రాక్టర్లతో కంకర, రాళ్లు తరలిపోతున్నా గత ఆరు నెలల్లో ఎలమంచిలి సర్కిల్‌ పరిధిలో కేవలం నాలుగు కంకర ట్రాక్టర్లు మాత్రమే పట్టుకున్నామని చెప్పడం విశేషం..

ఎస్‌.రాయవరం మండల దార్లపూడి సమీపంలో కరిగిపోతున్న గుట్ట

ఏటికొప్పాక, మన్యంపాలెం, ములకలాపల్లి, ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి నుంచి రోజూ కంకరను తరలిస్తున్నారు. కొన్నిచోట్ల   రాత్రి వేళల్లో పొక్లెయిన్‌ పెట్టి మరీ తవ్వేస్తున్నారు. పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లే ఉంటున్నారు. దీంతో అక్రమ వ్యాపారం మూడు పవ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది.


తవ్వకాలను అడ్డుకుంటాం...
- ఉమేష్‌కుమార్‌, ఇన్‌ఛార్జి ఈఈ, పోలవరం ప్రాజెక్టు, ఎలమంచిలి

పోలవరం కాలువ పక్కనున్న కంకర అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం ఇస్తున్నాం. మేం కూడా కొన్ని వాహనాలను పట్టుకున్నాం. ప్రస్తుతం హెటిరో డ్రగ్స్‌ కంపెనీ మాత్రమే కంకర తీసుకోవడానికి అనుమతి తీసుకుంది. ఎలమంచిలిలో ఒక పరిశ్రమ ఐదువేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి తీసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికీ తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని