logo

IND Vs AUS: టికెట్లు.. ఏవీ?!

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత మొదటిసారిగా విశాఖలో వన్డే మ్యాచ్‌ నిర్వహిస్తోంది.

Updated : 17 Mar 2023 09:44 IST

క్రికెట్‌ అభిమానుల నిరాశ
అధిక ధరలకు ‘బ్లాక్‌’లో?

టికెట్ల విక్రయ కేంద్రం వద్ద రద్దీ (పాతచిత్రం)

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత మొదటిసారిగా విశాఖలో వన్డే మ్యాచ్‌ నిర్వహిస్తోంది. ఈ నెల 19న విశాఖ-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌ను తిలకించాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

* ఇప్పటికే ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఏసీఏ 10, 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌లో,  ఈ నెల 14న నగరంలోని మూడు చోట్ల ఆఫ్‌లైన్లో విక్రయాలు చేపట్టగా అతి తక్కువ సంఖ్యలో మాత్రమే అభిమానులకు లభించాయి. ఆ రోజు వరసల్లో ఉన్న సగం మందికైనా లభించలేదని సమాచారం. చాలా మంది గంటల పాటు నిరీక్షించినా దొరకలేదు.

*   చాలా మంది ఆన్‌లైన్‌లో గంటల పాటు ప్రయత్నించినా ఒక్క టికెటైనా లభించలేదని వాపోతున్నారు. కొందరి చేతుల్లో మాత్రం పదుల సంఖ్యలో టికెట్లు కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి.వీటిని ‘బ్లాక్‌’లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

* ఈసారి మ్యాచ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన డిమాండు కనిపించింది. చివరిగా 2019 డిసెంబరులో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య విశాఖలో వన్డే జరిగింది. మళ్లీ ఇప్పుడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనుండడంతో ఎక్కువ మంది తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని వర్గాల నుంచి టికెట్లకు శ్రమించారు. కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నాయకులు మొదలుకొని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వరకు టికెట్ల కోసం నిర్వాహకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో రూ.600 టికెట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ఆశించినంత మందికి దొరక్క నిరుత్సాహపడ్డారు.


నాయకుల చేతుల్లోనే..

ఏసీఏ కార్యవర్గంలోని కొందరు కీలక వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో అధిక సంఖ్యలో టికెట్లు కాంప్లిమెంటరీల రూపంలో రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే నగరంలోని ప్రముఖ వ్యక్తులు, వ్యాపారులకు ఈ టికెట్లను కాంప్లిమెంటరీ రూపంలో అందజేసినట్లు సమాచారం. పలుకుబడి ఉన్న వ్యక్తులకు పదుల సంఖ్యలో అందించినట్లు తెలిసింది. మరో వైపు అధిక మొత్తంలో టికెట్లను పరిచయస్తులు, కొన్ని వాణిజ్య, పారిశ్రామిక సంఘాల వారికి అందజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంప్లిమెంటరీల రూపంలో కాకుండా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా అందేలా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం 27 వేలు. ప్రస్తుతం అదనంగా మరికొన్ని సీట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని