logo

ఎందుకిలా?

సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావించింది అధికార వైకాపా. అయితే ఓటమి చవిచూడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.

Published : 19 Mar 2023 04:12 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో వైకాపా నేతల దిగ్భ్రాంతి
మూడు రాజధానుల ఆలోచనను స్వాగతించని పట్టభద్రులు

ఈనాడు-విశాఖపట్నం:  సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావించింది అధికార వైకాపా. అయితే ఓటమి చవిచూడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో కొందరు మంత్రులకు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాల సరళితో ఆ పార్టీ ఉత్తరాంధ్రలో పట్టు సాధించడం కష్టమని పలువురు చెబుతున్నారు.  ప్రజల్లో, పట్టభద్రుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతం ఈ ఫలితాలతో స్పష్టమైంది. మూడు రాజధానులు.. పరిపాలనా రాజధానిగా విశాఖ అంటూ హడావుడి చేసినా ఓటర్లు స్వాగతించలేదు. అధికారం అడ్డుపెట్టి ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టినా వైకాపాకు ఓటమి తప్పలేదు. నేతల భూకబ్జాలు, విపక్ష నాయకులపై కక్ష పూరిత వేధింపులు వంటివి ఓటమికి కారణాలుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఫలించని వ్యూహాలు: వైకాపా తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు రంగంలోకి దిగినా ఓటమి తప్పలేదు. వైకాపాకు అనుకూలంగా ఉన్న అధికారులకు పదోన్నతులు, కోరుకున్న చోటుకు బదిలీలు చేస్తామనే హామీలు ఇచ్చారనే ప్రచారం సాగింది. అలాగే వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న అధికారుల జాబితా సిద్ధం చేస్తే ఎన్నికల తర్వాత దూర ప్రాంతాలకు బదిలీ చేస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పలు చోట్ల ప్రచారంలో వాలంటీర్లూ పాల్గొన్నారు. ఓటుకు నోటు,  వెండి బిస్కెట్ల పంపిణీ వంటి ప్రలోభాలు భారీగా జరిగాయి. కొన్ని చోట్ల ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మరీ నేతలు అడుగులు వేశారు. విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని, త్వరలోనే నగరానికి మకాం మారుస్తున్నానంటూ స్వయాన ముఖ్యమంత్రి ఇటీవల పెట్టుబడుల సదస్సులోనూ చెప్పారు. ఈ అంశంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపాకు మొగ్గు చూపుతారని భావించినా అంతా తలకిందులైంది. ఉత్తరాంధ్ర వైకాపాలో కొందరు నేతల మధ్య విభేదాలు, వర్గపోరు  ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ‘విజయసాయిరెడ్డి వ్యక్తిగా ముద్ర వేసుకున్న ఏయూ వీసీ, మాజీ రిజిస్ట్రార్లు వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు’ అంటూ ఎన్నిక   ముగిసిన తర్వాత పలువురు నేతలు తెరవెనుక వ్యాఖ్యానిస్తున్నారు.

భూకబ్జాలు, అక్రమాలపై వ్యతిరేకత: ప్రభుత్వ పాలనాతీరుతో పాటు వైకాపా నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రుషికొండను ఇష్టానుసారం తవ్వేయడంపైనా నగరవాసుల్లో అసంతృప్తి ఉంది. అనుమతుల్లేకుండా భారీ స్థాయిలో పలు చోట్ల నిర్మాణాలు సాగిస్తున్న అంశం విశాఖలో నిత్యం చర్చనీయాంశమవుతోంది. పలువురు మంత్రుల తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటన్నింటిపై ప్రజలు స్పష్టతతో ఉన్నారని,  రానున్న సాధారణ ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ ఫలితాలే వైకాపాకు పునరావృతమవుతాయని ప్రతిపక్షాల నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని