logo

గొప్ప ‘క్షణాలవి..’ దేశ ప్రధానిని కలుసుకోవటం మా అదృష్టం

‘దిల్లీకి వెళ్లడం.. స్వయంగా దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం మా జీవితంలో మరచిపోలేని గొప్ప క్షణాలవి’ అంటున్నారు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు.

Updated : 20 Mar 2023 05:01 IST

అధ్యయన యాత్ర అనుభవాలు పంచుకున్న విద్యార్థులు
న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

దేశ ప్రధాని నరేంద్రమోదీతో వసతిగృహ విద్యార్థులు

‘దిల్లీకి వెళ్లడం.. స్వయంగా దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం మా జీవితంలో మరచిపోలేని గొప్ప క్షణాలవి’ అంటున్నారు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు. ‘విద్య, ఆర్థిక అక్షరాస్యత’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన 14 మంది సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు దిల్లీ అధ్యయనయాత్రకు వెళ్లారు. జేడీ డి.వి.రమణమూర్తి పర్యవేక్షణలో ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులను ఈ యాత్రకు ఎంపిక చేశారు.ఇండియన్‌ బ్యాంకు సహకారం అందించింది. దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ముచ్చటించిన వీరు తిరుగు ప్రయాణమయ్యారు. అధ్యయన యాత్రలో అనుభవాలను ‘న్యూస్‌టుడే’ పంచుకున్నారు.

అధ్యయన యాత్రలో పాల్గొన్న విద్యార్థులు


యోగ సాధన గురించి ప్రధానికి వివరించాం
- ఎస్‌.కార్తీక భవానీ, 9వ తరగతి, పెందుర్తి వసతిగృహం

అధ్యయన యాత్రకు వెళ్లే అవకాశం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దిల్లీలో కర్తవ్యపథ్‌, ఇండియాగేటు, ప్రధాని కార్యాలయం, నోయిడా మింట్‌ ఫ్యాక్టరీ సందర్శించాం. పార్లమెంట్‌ భవనంలో దేశ ప్రధాని మోదీని కలిసే అదృష్టం దక్కింది. మా వసతిగృహంలో మేము చేసే యోగ సాధన గురించి ప్రధానికి తెలియజేయగా మమ్మల్ని అభినందించారు. ప్రతీ ఆదివారం స్వచ్ఛభారత్‌ పాటించాలన్నారు. ఇది జీవితంలో మరచిపోలేని సంఘటన.


వినోదం.. విజ్ఞానం పొందాను
- లావణ్య, పెందుర్తి వసతిగృహం

దిల్లీలో ప్రధానిని కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యాత్ర వల్ల విజ్ఞానం.. వినోదం రెండూ లభించాయి. ఇండియాగేట్‌, నేషనల్‌ మ్యూజియం వంటి ప్రాంతాలను సందర్శించాం. ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. పుస్తకాల్లో చదవటం కన్నా, ప్రత్యక్షంగా చూడటం వల్ల అనేక అంశాలపై అవగాహన కలిగింది.


నాణేల తయారీ గురించి తెలుసుకున్నాం..
- పి.సింధు, వసతిగృహ విద్యార్థిని

విజ్ఞాన యాత్రలో భాగంగా నోయిడాలోని మింట్‌ ఫ్యాక్టరీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ గురించి ముందు నాకు అసలు అవగాహన లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ ద్వారా వివిధ రకాల నాణేలను భారత ప్రభుత్వం ముద్రిస్తుందని తెలుసుకున్నాం. దీని గురించి మా స్నేహితులకు తెలియజేస్తాను.


పార్లమెంట్‌ భవనంపై అవగాహన వచ్చింది
- పి.ఆదిత్య, భీమిలి వసతిగృహం

నేను దిల్లీ వెళ్తానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రధానిని ప్రత్యక్షంగా కలవటం మరచిపోలేని అనుభూతి. దిల్లీలో పార్లమెంట్‌ భవనం సందర్శించి, లోక్‌సభ జరిగే తీరును తెలుసుకున్నాను. పబ్లిక్‌ గ్యాలరీలో 5 నిమిషాల పాటు కూర్చునే అవకాశం దక్కింది. ఇండియాగేట్‌ను ప్రత్యక్షంగా చూశాం. మా అధ్యయన యాత్ర గురించి విపులంగా రాసి అందరికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తాను.


ఇలాంటి అధ్యయన యాత్రలు అవసరం
- మహేంద్ర, వసతిగృహ విద్యార్థి

విద్యార్థి దశలోనే ఈ తరహా అధ్యయన యాత్రలు చాలా అవసరం. యాత్ర వల్ల వినోదమే కాకుండా ఎంతో విజ్ఞానం వచ్చింది. చాలా వరకు సందర్శనీయ ప్రాంతాల గురించి వినటం, పుస్తకాల్లో చదవటం జరుగుతుంది. ఇప్పుడు స్వయంగా తెలుసుకున్నాం. దేశ ప్రధాని మాతో ముచ్చటించటం మా అదృష్టమనే చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన సాంఘిక సంక్షేమశాఖ జేడీ రమణమూర్తి, బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు చెప్పాలి.


లోక్‌సభ సందర్శించాం..
- సుమతి, ఆనందపురం

సంయుక్త సంచాలకులు రమణమూర్తి ఆదేశాలతో అధ్యయన యాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలియని అనేక విషయాలను తెలుసుకునే అవకాశం దక్కింది. ఇన్ని ప్రాంతాలను ఒకేసారి చూడటం అనేది మాకు సాధ్యం కాని విషయమే. పార్లమెంట్‌ భవనం సందర్శించిన సమయంలో లోక్‌సభ ఎలా జరుగుతుంది? అధికార, ప్రతిపక్ష నాయకులు ఎక్కడెక్కడ కూర్చుంటారు.. స్పీకర్‌ గది ఇలా .. అన్నింటి గురించి విపులంగా తెలియజేశారు. ఒక విధంగా ఇది పూర్తిస్థాయి విజ్ఞానమనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని