logo

నూకాలమ్మ జాతరకు వేళాయె!

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, పిలిచిన పలికే ఇలవేల్పుగా భక్తులు కొలిచే అనకాపల్లి గవరపాలెం నూకాలమ్మ జాతర సోమవారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది.

Published : 20 Mar 2023 03:22 IST

నూకాలమ్మ అమ్మవారు

అనకాపల్లి, న్యూస్‌టుడే: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, పిలిచిన పలికే ఇలవేల్పుగా భక్తులు కొలిచే అనకాపల్లి గవరపాలెం నూకాలమ్మ జాతర సోమవారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. నెల రోజులు సాగే ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారితోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సుమారు 600 ఏళ్ల క్రితం ఆర్కాట్‌ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసే కాకర్లపూడి అప్పలరాజు బాహుబలేంద్రుని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈయన తన ఇలవేల్పు అయిన కాకతాంబను ఇక్కడ ప్రతిష్ఠించారు. తరవాత కాలంలో అప్పలరాజు వంశీయుడైన జగన్నాథరాజును పాయకరావుపేట వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్‌వారు ఓడించి అక్కడే ఉరితీశారు. అనకాపల్లికి సామంతులుగా విజయనగరం రాజులను నియమించారు. తర్వాత ఇది వైరిచర్ల ఆనందగజపతిరాజు ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి కాకతాంబను నూకాలమ్మగా పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ వైరిచర్ల వంశీయులే దేవస్థాన శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నూకాలమ్మ దేవాలయం 1935లో దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. పూర్వం జాతర నెలరోజులే భక్తులు వచ్చేవారు. కొన్నేళ్లగా జాతర ముగిసిన రెండు నెలల వరకూ భక్తులు భారీగా వస్తూనే ఉన్నారు.

ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు

రూ. 11 కోట్లతో ఆలయ పునః నిర్మాణం

నూకాలమ్మ ఆలయాన్ని రూ. 11 కోట్లతో పునః నిర్మిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. ఆలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతర ముగిసిన తర్వాత జూన్‌ 1న శంకుస్థాపన చేస్తామన్నారు. రూ. 4 కోట్లతో అంతరాలయం, గర్భాలయం, రూ. 3.5 కోట్లతో ప్రాకారమండపం, రూ. 3 కోట్లతో మూడు రాజగోపురాలు, రూ. 50 లక్షలతో ఇతర అభివృద్ది పనులు చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టు నుంచి రూ. 3 కోట్లు ప్రకటించారన్నారు. మిగిలిన డబ్బు దేవస్థానం నుంచి భరిస్తామని తెలిపారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాడి జయవీర్‌ పాల్గొన్నారు.  

దర్శన వేళలు: దేవాలయాన్ని రోజూ ఉదయం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ఉదయం 6 నుంచి 6.30, మధ్యాహ్నం 11.30 నుంచి 12, సాయంకాలం 4 నుంచి 4.30 వరకు భక్తులకు ప్రవేశం ఉండదు. సాయంకాలం 6 నుంచి 6.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహిస్తారు. ఈ సమయంలో గర్భాలయ ప్రవేశం ఉండదు.

టిక్కెట్ల వివరాలు: ఉచిత దర్శనంతోపాటు విశిష్ట (రూ. 50), ప్రత్యేక (రూ. 100), అతి శీఘ్రుదర్శనాలు (రూ. 200) అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని