logo

మూడు సమోసాలు రూ.70.. 300 గ్రాముల పెరుగన్నం రూ.90

ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వన్డే మ్యాచ్‌ సందర్భంగా చేసిన కొన్ని ఏర్పాట్లు క్రికెట్‌ అభిమానులకు పరీక్షగా నిలిచాయి. వాటిపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 20 Mar 2023 04:54 IST

అధిక ధరలపై అభిమానుల ఆగ్రహం
చాలా చోట్ల తాగునీరు అందక అవస్థ
ఈనాడు, విశాఖపట్నం

తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ కుర్చీలు

ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వన్డే మ్యాచ్‌ సందర్భంగా చేసిన కొన్ని ఏర్పాట్లు క్రికెట్‌ అభిమానులకు పరీక్షగా నిలిచాయి. వాటిపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కుర్చీలు సరిగా లేకపోవడం, తాగునీరు అందకపోవడం, ఆహార పదార్థాలపై అధిక ధరలు వసూలు చేయడంపై  విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు 2023-25 కాలానికి ఎన్నికైన కొత్త కార్యవర్గం ఈ మ్యాచ్‌ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా... కొన్ని సౌకర్యాల విషయంలో ప్రేక్షకులకు ఇబ్బందులు తప్పలేదు.

అమ్మో ఇంతా?..

కొన్ని స్టాండ్లలో తాగునీటికి ఏర్పాట్లు చేసినా అవెక్కడో తెలియక ప్రేక్షకులు  అవస్థలు పడ్డారు. మైదానంలోకి బయట నుంచి నీళ్ల సీసాలను అనుమతించకపోవడంతో పిల్లలతో వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. లోపల నీళ్ల సీసాల కన్నా శీతల పానీయాలే అధికంగా అమ్మడంతో వాటిని తప్పక కొనుగోలు చేయాల్సి వచ్చిందని వీక్షకులు పేర్కొన్నారు. స్టేడియం లోపల ఆహార పదార్థాలను అధిక ధరకు విక్రయించడంపైనా విమర్శలు వచ్చాయి. మూడు సమోసాలు రూ.70లకు,  300 గ్రాముల పెరుగన్నం రూ.90లకు, 130 గ్రాముల పకోడి రూ.70లకు, 300 గ్రాముల ఎగ్‌ బిరియానీ రూ.120లకు విక్రయించారు. శీతల పానీయాలను రెట్టింపు ధరలకు విక్రయించడంతో బెంబేలెత్తిపోయారు. సినిమా థియేటర్లలో రూ.40 విక్రయించే పానీయాలనుఇక్కడ రూ.60కి అమ్మారు. చిప్స్‌ ప్యాకెట్లను ఎంఆర్‌పీ ధర కన్నా రెండింతలకు విక్రయించారని కొందరు తెలిపారు. పలు స్టాండ్లలో కుర్చీలు అధ్వానంగా ఉన్నాయి. సౌత్‌ ఈస్టు లోవర్‌ స్టాండులో శాశ్వత కుర్చీలు లేని చోట తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అవీ సరిగా లేవనే విమర్శలు వచ్చాయి.

టోపీలు ఇస్తామని..

వేసవి కావడంతో ఎండ వేడిమి తట్టుకునేలా టోపీలు ఇచ్చే ఏర్పాటు  చేయాలని కలెక్టరు మల్లికార్జున సూచించారు. అందుకు ఏసీఏ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ టోపీలు ఇవ్వాలని నిర్ణయించింది. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాతావరణం చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకుల్లో కొందరు తమకు తెలిసిన వారికి ఉన్నత శ్రేణి పాసులు, గుర్తింపు కార్డులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు జిల్లా అధికారులకు కూడా సాధారణ పాసులు ఇచ్చారు. ఓ ఉన్నతాధికారి కుటుంబాన్ని సౌత్‌ బ్లాక్‌లో కూర్చోబెట్టగా మధ్యలోనే వెళ్లిపోయారు. ఏసీఏలో పనిచేసే కొందరు తమకు తెలిసిన వ్యక్తులకు ఇష్టానుసారంగా గుర్తింపుకార్డులు ఇచ్చుకున్నారని పలువురు విమర్శించారు.


రూ.600 టికెట్‌ రూ.6 వేలు..

‘బ్లాక్‌’లో టికెట్లను యథేచ్ఛగా విక్రయించారు. ఆదివారం ఉదయం నుంచి మ్యాచ్‌ ప్రారంభమయ్యే వరకు వీటి విక్రయాలు స్టేడియం బయట కొనసాగడం గమనార్హం.  కొందరు రూ.600 టికెట్లను రూ.6 వేలకు కూడా  అమ్మారు. రూ.3500 టికెట్ల రూ.8 వేల వరకు విక్రయించడం గమనార్హం. పలువురి వద్ద ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఉండడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.


పరుగులు పెట్టించిన డీసీపీ..

స్టాండ్స్‌లోకి వచ్చిన డీసీపీ సుమిత్‌ సునీల్‌ గరుడ

మ్యాచ్‌ జరుగుతుండగా కొందరు పోలీసులు మ్యాచ్‌ వీక్షించేందుకు స్టాండ్స్‌లోకి వచ్చారు. దీన్ని గుర్తించిన డీసీపీ సుమిత్‌ సునీల్‌ గరుడ స్టాండ్స్‌లోకి వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తున్న పోలీసులను పరుగులు పెట్టించారు. పహారా కాయకుండా మ్యాచ్‌ చూడడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న పోలీసులు స్టాండ్స్‌లో పరుగులు పెట్టడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందోనని వీక్షకులు ఆందోళన చెందారు. ఆ తరువాత అక్కడున్న పోలీసులు వారికి అప్పగించిన విధుల్లో నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని