logo

చీకట్లో నగర వీధులు..!

విశాఖ నగరంలో ఏడాదిన్నరగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. శివారు ప్రాంతాలైన గాజువాక, పెందుర్తి, మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాలలో రాత్రుళ్లు కేవలం ప్రధాన రహదారులపై మాత్రమే వెలుగులు కనిపిస్తున్నాయి.

Published : 21 Mar 2023 03:34 IST

ఏడాదిగా పడకేసిన వీధి దీపాల నిర్వహణ
గుత్తేదారు ఎంపికలో మీనమేషాలు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

తెలుగుతల్లి పైవంతెన నుంచి సిరిపురం వెళ్లే మార్గంలో వెలగని దీపాలు

విశాఖ నగరంలో ఏడాదిన్నరగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. శివారు ప్రాంతాలైన గాజువాక, పెందుర్తి, మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాలలో రాత్రుళ్లు కేవలం ప్రధాన రహదారులపై మాత్రమే వెలుగులు కనిపిస్తున్నాయి. వీధుల్లో మాత్రం అంధకారం నెలకొంది. నగర నడిబొడ్డున ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ దుస్థితి నెలకొంది. మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం ఎన్నికై రెండేళ్లయింది. కౌన్సిల్‌ సమావేశాల్లో పలుమార్లు ప్రతిపక్ష కార్పొరేటర్లు వీధి దీపాల నిర్వహణ తీరుపై ప్రశ్నించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వార్డుల్లో దీపాలు వెలగడం లేదని  అధికారులకు ఫిర్యాదులు చేసి అలసిపోయే స్థితికి చేరుకున్నారు. నగరంలో జి-20 సన్నాహక సదస్సుల సందర్భంగా వెలగని వీధి దీపాల స్తంభాలను రంగుల దీపాలతో అలంకరించడం కొసమెరుపు.

ఈఈఎస్‌ఎల్‌తో ముగిసిన ఒప్పందం

2014లో హుద్‌హుద్‌ తుపాను ప్రభావంతో నగరంలో వేలాది వీధి దీపాలు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో అధునాతన (మోడ్రన్‌ లైటింగ్‌) ఎల్‌ఈడీలు అమర్చాలని అప్పటి తెదేపా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈఈఎస్‌ఎల్‌(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూసిన ఈఈఎస్‌ఎల్‌ గుత్త కాలం గడువు గతేడాది ప్రారంభంలో ముగిసింది. కొత్తవారికి ఆయా బాధ్యతలు అప్పగించాలని ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా జీవీఎంసీ అధికారులు సఫలీకృతులు కాలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

1.18 లక్షల దీపాలు...5641 సీసీఎంఎస్‌ బాక్సులు

నగరంలోని 1.18 లక్షల ఎల్‌ఈడీ దీపాలు, 5641 సీసీఎంఎస్‌ (సెంట్రల్‌ కంట్రోల్‌ అండ్‌ మోనటరింగ్‌ సిస్టం) బాక్సుల నిర్వహణ కోసం ఏడేళ్లపాటు ఆర్‌ఎఫ్‌పీ(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) టెండరును ఆరునెలల కిందట జీవీఎంసీ ఆహ్వానించింది. ఇందులో భాగంగా వీధి దీపాల నిర్వహణ, పాడైన వాటి స్థానంలో కొత్తవి అమర్చడం వంటి ఒప్పందాలను పెట్టారు. అప్పుడు ఒక గుత్తేదారు మాత్రమే ముందుకు వచ్చారు. దీంతో మూడు నెలల కిందట మరోసారి టెండరు పిలిచారు. అప్పుడు కూడా ఆ గుత్తేదారే ఆసక్తి చూపారు. ఏడేళ్ల ఒప్పందానికి రూ.65 కోట్లు చెల్లించాలని అతను కోరడంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత గుత్తేదారుకు బాధ్యతలు అప్పగిస్తామని ఏడాది కిందట ప్రకటించారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

పన్నులు వసూలు చేస్తున్నా..

రాత్రుళ్లు నగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పాలకవర్గం ఆ దిశగా కనీసం దృష్టి సారించడం లేదు. పన్నుల రూపంలో రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉండడంపై నగర వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి దీపాల నిర్వహణ టెండరు ఖరారు చేసి వెలుగులు నింపాలని కోరుతున్నారు.

మేఘాలయ హోటల్‌ ఎదురుగా వాణిజ్య సముదాయాల వెలుగులే దిక్కు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని