logo

బడికెళ్లే వయసులో మూడుముళ్ల బంధనం?

గతేడాది నవంబరు 4న బుచ్చెయ్యపేట మండలం నాతవానిపాలెంలో 14 ఏళ్ల బాలికకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసులు వివాహాన్ని ఆపి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Published : 21 Mar 2023 03:28 IST

జిల్లాలో బాల్య వివాహాలకు పడని అడ్డుకట్ట
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

గతేడాది నవంబరు 4న బుచ్చెయ్యపేట మండలం నాతవానిపాలెంలో 14 ఏళ్ల బాలికకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసులు వివాహాన్ని ఆపి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 21న మునగపాక మండలం గణపర్తిలో 13 ఏళ్ల బాలికకు వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఇదే రోజు ఇదే గ్రామంలో 14 ఏళ్ల బాలికకు వివాహం చేస్తుండగా దానినీ అడ్డుకున్నారు.

కాలం మారినా.. ఆధునికత, సాంకేతికత పెరిగినా.. బాల్యవివాహాల దురాచారం ఈనాటికీ కొనసాగుతోంది. కాలానుగుణంగా బాలికలు చదువుకుంటూ అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతున్నా కొంతమంది తల్లిదండ్రులు పాత పోకడలోనే వెళ్తున్నారు.  

ఫలితంగా జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 2002 మార్చి నుంచి 2023 మార్చి వరకు జిల్లాలో 39 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో పదోతరగతి పూర్తికాకుండానే బాలికలకు వివాహాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆడపిల్లలను భారంగా భావిస్తూ.. తక్కువ వయస్సులోనే వివాహాలు చేయడం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. చిన్న వయసులోనే పెళ్లి చేయడం ఆడపిల్లల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఆడపిల్లలకు నిర్ణీత వయసు వచ్చేవరకు వివాహాలు చేయకూడదన్న ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీనిని కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్‌వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తూ చిన్నవయసులో పెళ్లిళ్లు చేయాలని చూస్తే చర్యలు తీసుకుంటున్నారు. కానీ అధికారుల దృష్టికి రాకుండా గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నది అంగీకరించాల్సిన నిజం. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో బాల్య వివాహాల్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో చిన్నవయసులో పెళ్లి చేయడం వల్ల జరిగే దుష్ప్రభావాలను వివరిస్తూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.


పడే శిక్షలివీ..

* 18 ఏళ్ల కంటే తక్కువున్న బాలికను వివాహం చేసుకుని   సంసారం చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం-2006, పోక్సో చట్టం 2012 సవరణ చట్టం-2019 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష. రూ. లక్ష జరిమానా.. రెండూ కలిపి విధించవచ్చు.

* బాల్య వివాహాల నిరోధక చట్టం-2006లోని 10వ సెక్షన్‌ ప్రకారం బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా పడుతుంది. 2006 11 (1) ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులు బాల్య వివాహాలను ప్రోత్సహించినా, అనుమతించినా, బాల్య వివాహంలో పాల్గొన్నా రెండేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు.

మునగపాక మండలంలో బాల్య వివాహంపై కౌన్సెలింగ్‌ ఇస్తున్న అధికారులు


సమీకృత బృందమేదీ?

బాలలపై జరిగే అరాచకాలు అరికట్టడం, బాల కార్మికులుగా పనిచేస్తున్న వారికి గుర్తించి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేయడం. అక్రమ రవాణాను అడ్డుకోవడం, బాల్య వివాహాలను ఆపడం వంటి బాధ్యతలు సమీకృత బాలల రక్షణ బృందం (ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ టీం) నిర్వర్తించాల్సి ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలిసి 10 మంది బృందం సభ్యులు జిల్లాలో సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఈ బృందాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు.


ఆడపిల్లలను ప్రయోజకులను చేయాలి : జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఏడాది కాలంలో 39 పెళ్లిళ్లు ఆపాం. పిల్లలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులతోపాటు పెళ్లి చేసుకున్నవారికి, ప్రోత్సహించిన వారికి పడే జైలుశిక్షల గురించి వివరిస్తున్నాం. ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయడంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అంగన్‌వాడీ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చి వీటిని అడ్డుకోడానికి స్థానికులు సహకరించాలి.

జి.ఉషారాణి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి, అనకాపల్లి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని