Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్‌

జనసేన తమతో కలిసి రావడం లేదని మా ఆరోపణ. జనసేన, భాజపా కలిసి వెళ్తేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని భాజపా నేత మాధవ్‌ అన్నారు. విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

Updated : 21 Mar 2023 18:13 IST

విజయవాడ: ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో కాక రేపాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో భాజపా నేత పీవీఎన్‌ మాధవ్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. ‘‘జనసేన మాతో కలిసి రావడం లేదని మా ఆరోపణ. జనసేనతో పేరుకు మాత్రమే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగింది. భాజపాకు దూరం కావాలంటే జనసేన ఇష్టం. కలిసి సాగాలనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. తమ అభ్యర్థికి జనసేన మద్దతుందని పీడీఎఫ్‌ ప్రచారం చేసింది. పీడీఎఫ్ ప్రకటన ఖండించాలని కోరినా జనసేన చేయలేదు.

మేం వైకాపాతో ఉన్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. భాజపా అధిష్ఠానానికి చెప్పే అన్నీ చేస్తున్నామని వైకాపా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం. వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం కూడా నష్టం చేసింది. వైకాపా వేసిన అపవాదును తుడిచివేసేందుకు ప్రయత్నిస్తాం. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ వేస్తాం. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది’’ అని మాధవ్‌ తెలిపారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా నేత మాధవ్‌కు 10,884 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలైన విషయం తెలిసిందే. శాసనమండలిలో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని