logo

మింగేసిన మూడంతస్తుల మేడ!!

ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది.

Published : 24 Mar 2023 02:35 IST

అర్ధరాత్రి కుప్పకూలిన భవనం

ముగ్గురు దుర్మరణం

ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు బృందాలు

ఈనాడు-విశాఖపట్నం: ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఊహించుకొని...పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. అప్పటి వరకూ సంతోషంగా కళ్లముందు తిరిగిన కొడుకు దుర్గాప్రసాద్‌, కూతురు అంజలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఊహించని పరిణామం. బుధవారం అర్ధరాత్రి జిల్లా పరిషత్‌ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కూలిన దుర్ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణం శిథిల భవనమా?  అధికారుల నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో శిథిల భవనాల పరిశీలనా ప్రక్రియపై అనుమానాలు రేగుతున్నాయి.

వీరి ప్రాణాలు అలా దక్కాయి..

‘ఫాస్ట్‌ ఫుడ్‌’ సెంటర్‌లో పని చేసి ఆలస్యంగా వచ్చిన శివశంకర్‌... చోటూతో పాటు ఇంట్లో ఉన్నప్పటికీ నిద్ర పట్టకపోవడంతో కొంత మెలకువగా ఉన్నారు. అదే సమయంలో శబ్దాలు వస్తూ ఒక్కో అంతస్తు కుప్పకూలుతుండటంతో గమనించి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చివరి అంతస్తులో ఉంటున్న కృష్ణ, రోజారాణి గాఢ నిద్రలో ఉన్నారు. భవనం కుప్పకూలే సమయంలో పై అంతస్తు వరకు పక్కకు ఒరిగి పడటంతో సమీపంలో ఇంటి నిర్మాణానికి ఉంచిన ఇసుక, మట్టి దిబ్బలపై వీరు పడ్డారు. రోజారాణిపై మంచం పడగా.. సిమెంటు శిథిలాలు మంచంపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. అంతస్తు ఒరిగినప్పుడు పక్కనే నిర్మాణంలో ఉన్న భవన పిల్లర్లపై పడినా భార్యాభర్తలిద్దరూ ప్రమాదంలో చిక్కుకునేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కూలిన భవనం

నలభై ఏళ్లు నాటిదిగా స్థానికులు చెబుతున్నారు. పైగా ఈ భవనాన్ని ఎలాంటి పిల్లర్లు లేకుండా నిర్మించారు. పునాదులు సైతం తక్కువలోతు తవ్వి ఏకంగా మూడంతస్తుల వరకూ నిర్మించారు. ఈ భవనం ఒమ్మి అప్పారావు పేరుతో ఉండగా, ఆయన తదనంతరం కుమారుల చేతికి వచ్చినట్లు సమాచారం. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అద్దెకు ఇచ్చారు. సాకేటి రామారావు కుటుంబం గత ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఈ పురాతన భవనాన్ని ఆనుకుని ఉన్న మరో పాత భవనం ఇటీవలే పడగొట్టి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. పదిరోజుల కిందట ఈ నిర్మాణం సమీపంలో బోరు వేశారు. ఆ సమయంలో ప్రకంపనలు వస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తులు ఆ సమయంలో నిలిపివేశారు. రాత్రి సమయంలో మళ్లీ మొదలు పెట్టి బోరు వేసి వెళ్లిపోయారని క్షతగాత్రులు చెబుతున్నారు. బోరు వేయడానికి వాల్టా చట్టానికి లోబడే అధికారులు అనుమతులిచ్చారా? లేక అనధికారికంగా వేశారా? అనేది తేలాల్సి ఉంది. కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండటంతో రాత్రిళ్లు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.


పెద్ద శబ్దం వచ్చింది: రాజు

నేను ఆటోడ్రైవరును. రాత్రి భోజనం చేసి పడుకున్నా. కొద్ది సేపటికే పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూస్తే పొగ మా ఇల్లంతా కమ్మేసింది. ఆ దూళికి ఇంట్లోవారికి ఊపిరి ఆడనంత పనైంది. వెంటనే బయటకు పంపించేశాను. కళ్లముందు భవనం కుప్పకూలి కనిపించింది. ఆ తర్వాత అందరం కలిసి ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీశాం.


భూకంపం వచ్చిందనుకున్నాం: ప్రకాశ్‌

భారీ శబ్దం రావడంతో భూకంపం వచ్చిందని భయపడ్డాం. కమ్మేసిన దుమ్ములో ఇద్దరు ప్రాణభయంతో అరుస్తూ కనిపించారు. వాళ్లని దూరంగా తీసుకొచ్చాక, క్షతగాత్రులను ఆసుపత్రికి పంపేందుకు సాయం చేశాం. బుధవారం దుర్గాప్రసాద్‌ పుట్టినరోజు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం కలిచివేసింది.


మంచం పడటంతో:  రోజారాణి

నిద్రలో ఉండగా రెండో అంతస్తు నుంచి పక్కకు పడిపోయాం. నాపై మంచం పడటంతో బయటపడ్డాను. లేదంటే స్లాబు నాపై పడి ఉండేది. కొన్ని రోజుల క్రితం పక్కనే బోర్‌ వేశారు. ఆ సమయంలో  ఇల్లు కొంత కంపించింది. ఆ తర్వాత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇలా కూలిందేమోననిపిస్తోంది.


చదివి పడుకున్నారు: కన్నప్పడు

ఇంటర్‌ పరీక్షలకు దుర్గా  ప్రసాద్‌, పదో తరగతి పరీక్షలకు అంజలి రాత్రి వరకూ చదివి  పడుకున్నారు.కొద్ది సేపటికే ఈ  ప్రమాదం జరిగింది. మా అన్న(రామారావు) పిల్లలు ఆగస్టులో గొల్లలమర్రివలస గ్రామానికి వచ్చి నా కూతురు పెళ్లికి హాజరయ్యారు. పదేళ్లుగా విశాఖలోనే ఉంటున్నారు. వదినకు పిల్లలు చనిపోయిన విషయం ఇంకా తెలియదు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని