logo

‘విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే’

గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న హత్యలుగానే తాము పరిగణిస్తున్నామని జనసేన అరకు పార్లమెంటు బాధ్యులు వంపూరు గంగులయ్య అన్నారు.

Published : 24 Mar 2023 02:35 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న హత్యలుగానే తాము పరిగణిస్తున్నామని జనసేన అరకు పార్లమెంటు బాధ్యులు వంపూరు గంగులయ్య అన్నారు. గురువారం చింతపల్లి వచ్చిన ఆయన జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకరులతో మాట్లాడారు. గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో ఎప్పటినుంచో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పూర్తిగా తొలగించిందన్నారు. రాత్రివేళ విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణ సమాచారం సైతం రావడం లేదన్నారు. సంక్షేమం పేరుతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్క కుటుంబానికీ ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని గొప్పలు చెబుతూ పబ్బం గడుపుతోందని చెప్పారు. జిల్లాలో ఉన్న ఖనిజ సంపద తవ్వుకుపోయేందుకే ముఖ్యమంత్రి జగన్‌ గుంటూరుకు చెందిన కుంభా రవిబాబుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. అరకులోయ నియోజకవర్గంలోని డేగాపురం, వాలాసి, నిమ్మలపాడులో కాల్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయని, ఇక్కడ మైనింగ్‌ ఎవరిపేరున ఉందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పాడేరు, అరకు ప్రాంతాల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను జగన్‌కు అయిన వారైన అదానీ, కడపకు చెందిన శ్రీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీలకు కట్టబెట్టారని గుర్తు చేశారు.. నాయకులు బుజ్జిబాబు, ప్రశాంత్‌, రాజన్న, కృష్ణమూర్తి, భానుప్రసాద్‌  పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని